బీసీ యువకెరటం.. ఈడిగ శ్రీనివాస్ గౌడ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీ యువకెరటం.. ఈడిగ శ్రీనివాస్ గౌడ్..!
– రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక
– బీసీ యువతను ఏకం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : బషీరాబాద్ మండలం రెడ్డిఘనాపూర్ గ్రామానికి చెందిన ఈడిగ శ్రీనివాస్ గౌడ్‌కు రాష్ట్రస్థాయి బాధ్యతలు దక్కాయి.

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన బీసీ యువజన సంఘం విస్తృతస్థాయి సమావేశంలో ఆయనను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హెచ్. హనుమంతరావు, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తదితర ప్రముఖులు హాజరయ్యారు. బీసీ యువజన సంఘం జాతీయ, రాష్ట్ర నాయకులు నూతన అధ్యక్షుడి ఎన్నికను ఆమోదించారు.

గత 15 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం, బీసీ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్న శ్రీనివాస్ గౌడ్ విద్యార్థి, యువజన సంఘాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. బీసీల హక్కులు, సామాజిక న్యాయం, యువత సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తూ వచ్చిన ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై బీసీ యువజన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంఘం జాతీయ, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా బీసీ యువతను ఏకం చేసి హక్కులు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికారం కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తానన్నారు. బీసీ యువత రాజకీయాల్లోకి రావాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎదిగే స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ కులగణన పూర్తిస్థాయిలో జరిగి, జనాభా ప్రాతిపదికన బీసీలకు న్యాయమైన వాటా, హక్కులు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీసీ యువత ఐక్యత, రాజకీయ చైతన్యమే సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఎంపీ డా. మల్లు రవితో బీఎస్ఆర్ ఆత్మీయ భేటీ