సీజనల్ వ్యాధులే డేంజర్..!
– అందరు జాగ్రత్తలు పాటించాలి
– కలుషిత ఆహారంపై అప్రమత్తం తప్పనిసరి
– తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు హెచ్చరిక
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో వర్షాల కారణంగా సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని, అందరు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతవారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని, ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలన్నారు. బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, పాముకాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
జ్వరం వచ్చినప్పడు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధుల టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా.. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో గర్భిణులు వారం ముందే ఆసుపత్రుల్లో చేరి వైద్యం తీసుకోవాలన్నారు. బాలింతలు, చంటిపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో వైద్యారోగ్యశాఖ మంత్రి, వైద్యారోగ్యశాఖ సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలెట్ కార్యక్రమం పూర్తయ్యిందన్నారు. కోవిడ్ నుంచి పూర్తిగా బయటపడ్డా.. ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలని అన్నారు. కరోనాతో ఇక భయపడాల్సిన అవసరంలేదని.. అయితే మాస్క్ మాత్రం కచ్చితంగా పెట్టుకోవాలని సూచించారు.
ప్రజలు ‘ఫ్రై డే – డ్రై డే’ కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రజలు సరైన ఆహారం, మంచినీరు తీసుకోవాలి, ఆహారం వేడిగా ఉండేలా చేసుకోవాలని.. అదే సమయంలో గోరువెచ్చటి నీటిని తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జలుబు, జ్వరం, విరేచనాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. పానీపూరి, బయటి ఫుడ్ తినేటప్పుడు శుభ్రంగా ఉన్నాయా? లేదా? అని చూసుకోవాలన్నారు. చిన్న నొప్పులే కదా అని తేలిగ్గా తీసుకుని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు.
రాష్ట్రంలో 1,184 డెంగీ కేసులు
వర్షాలు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,184 డేంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌లో 516, మిగితా కేసులు కరీంనగర్‌తో పాటు పలు జిల్లాల్లో నమోదయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయని డీహెచ్ తెలిపారు. భద్రాద్రిలో 115, మలుగులో 113, భూపాలపల్లిలో నాలుగు, ఆసిఫాబాద్‌లో మూడు, నల్లగొండలో ఐదు కేసులు నమోదయ్యాయని చెప్పారు. మే నెలలో మూడు చికున్ గున్యా కేసులు రికార్డయ్యాయన్నారు. ఈ నెలలో ఆరువేల విరేచనాల కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాది టైఫాయిడ్ కేసులు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయన్నారు.



