హడలెత్తిస్తున్న వీధి కుక్కలు
– గుంపులు, గుంపులుగా సంచారం
– భయాందోళన చెందుతున్న పట్టణ వాసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ప్రతి వార్డుల్లో.. వీధుల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తుండడంతో పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల పట్టణంలో వీధి కుక్కుల స్వైర విహారం పెరిగిపోయింది. ఒకేసారి చోట రెండు మూడు కంటే పదుల సంఖ్యల వరకు తిరుగుతున్నాయి. వీధి కుక్కలే కదా అనుకుని పక్కనుంచి వెళదామనుకుంటే ఎక్కడ దాడి చేస్తాయో అని చిన్నారులు, పెద్దలు కూడ జంకుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో వీధి కుక్కలు చిన్నారులు, యువకులు, వృద్ధులు అని తేడాలేకుండా గాయాలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా పట్టణ ప్రధాన వీధుల్లో కూడ కుక్కల స్వైర విహారం అధికమైంది. వీధి కుక్కల బెడదపై ప్రజా ప్రతినిధులు వాటిని నియంత్రించాలని కోరారు. దీనిపై కౌన్సిల్‌లో కూడ తీర్మానం చేశారు. అయినా కూడ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టపోవడంపై పలువురు పెదవి విరుపు విమర్శలు చేస్తున్నారు.


