కార్పెంటర్ల కన్నెర్ర..!
– అటవి అధికారుల వేధింపులపై ఆగ్రహం
– కార్యాలయం ముందు బైటాయించి నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : అటవీశాఖ అధికారుల వేధింపులను నిరసిస్తూ తాండూరు కార్పెంటర్లు కన్నెర్ర చేశారు. గురువారం తాండూరులోని అటవిశాఖ కార్యాలయం ముందు బైటాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచే యూనిట్లు, దుకాణాలు మూసుకుని నిరసనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు పులేందర చారి, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్, సభ్యులు ఈర్షాద్‌లు మాట్లాడుతూ చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారిపై అటవీశాఖ అధికారులు ఒత్తిళ్లు, భయాందోళనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జీవో 69 పేరుతో దాడులు నిర్వహిస్తూనే.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా చెట్ల కట్టెలను నిల్వ ఉంచుకుంటున్నారని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవిశాఖ అధికారులు సీ ఫీజు పేరుతో కార్పెంటర్లను వేధించడం పద్దతి కాదన్నారు. ఆధునిక పరికరాలు రావడంతో చేతి వృత్తుల వారు నష్టపోతున్నారని అన్నారు. సామిల్ వారి నుంచి కట్టెలను తీసుకుంటున్నామని, వారిని వదిలేసి కార్పెంటర్ల మీద పడడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా కార్పెంటర్లను వేధించడం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల దృష్టికి తీసుకెళతామని, కార్పెంటర్లపై వేధింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు అధ్యక్షులు పాండురంగా చారి, ఇస్మాయిల్, కాలప్ప తదితరులు పాల్గొన్నారు.


