అల్లంతో ఆరోగ్య యోగం

ఆరోగ్యం జాతీయం తెలంగాణ హైదరాబాద్

అల్లంతో ఆరోగ్య యోగం
– రోజూ తీసుకుంటే ప్రయోజనాలెన్నో
– కొలస్ట్రాల్‌ నియంత్రణలో సహాయం
దర్శిని డెస్క్‌: అల్లం ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అల్లంలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేదంలో అల్లంను ఒక ఔషధంగా వినియోగిస్తారు. అంతేకాదు కూరలతో పాటు టీలోనూ ఉపయోగిస్తాం. ఔషధ గుణాలున్న అల్లాన్ని హోమియోపతిలో కూడా ఉపయోగిస్తారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న అల్లం రోజూ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వంటింట్లో అందరికీ అందుబాటులో ఉండే అల్లం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం, ఆహారం జీర్ణం కాకపోవటం వంటి సమస్యలున్న వాళ్లు అల్లం వేసి మరగబెట్టిన నీటిని తాగటం మంచిది. కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల డయాబెటీస్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు.. నీటిలో అల్లం వేసి మరిగించి, కాస్త నిమ్మ రసం కలిపి తాగితే మంచి ఫలితాలుంటాయి. బరువు తగ్గించేందుకు అల్లం చక్కగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం అల్లం వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల అనవసరమైన కొవ్వు కరుగుతుంది.

అల్లం పొట్టుతో కూడ ఉపయోగాలు
రోగ నిరోధక శక్తి కోసం టీలు, కషాయాల రూపంలో అల్లం తీసుకున్న వారు ఉన్నారు. అల్లం తురిమిన తర్వాత ఆ పొట్టను పడేయకుండా ఎండబెట్టుకోండి. బాగా ఎండిన తర్వాత పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఎప్పుడైనా దగ్గు, జలుబు చేసినప్పుడు.. తేనెతో ఆ పొడిని కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఉదర సంబంధమైన సమస్యలను తగ్గించడంలో అల్లం పొట్టు బాగా పనిచేస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకొని, అందులో అల్లం పొట్టను వేసి బాగా మరిగించాలి. కాస్త చల్లబడిన తర్వాత వేడి వేడిగా తాగితే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు దరిచేరవు. టేస్ట్ కోసం కొంచెం తేనె కలుపుకోవచ్చు. గొంతు గరగరగా ఉన్నా, పొడి బారినా.. అల్లం పొట్టుతో చేసిన టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. ఐతే అదే పనిగా ఈ టీని ఎక్కువగా తాగకూడదు. పరిమితంగా తీసుకుంటేనే మంచిది. అల్లం పొట్టును పడేయకుండా ఇంట్లో పెంచుకునే మొక్కలు ఎరువుగా వేయవచ్చు. అల్లం పొట్టులో భాస్వరం ఎక్కువగా ఉంటుంది. అది మొక్కలు బాబా పెరిగేందుకు దోహదపడుతుంది.