పది రోజుల్లో రైతు బంధు
– ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతులకు పదిరోజుల్లో రైతు బంధు సాయాన్ని అందించాలని నిర్ణయించారు. యాసంగి సీజన్ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వానాకాలం సీజన్‌కు సంబంధించి జూన్ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది. అయితే ఈ యాసంగి సీజన్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే బడ్జెట్ కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు అవసరముంటుందని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. డిసెంబర్ 15 నుంచి అంటే మరో పది రోజుల్లోనే తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక గత వానాకాలం సీజన్‌లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలున్న వారికి.. ఇలా ఆరోహణ పద్ధతిలో నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిలో పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
