మార్కెట్ కమిటి చైర్మన్ రిజర్వేషన్ మార్చాలి
– చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పదవి రిజర్వేషన్‌ను మార్చాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రేపు గురువారంతో తాండూరు మార్కెట్ కమిటి పాలకవర్గం పదవి కాలం పూర్తవుతోంది. కొత్త పాలకవర్గంలో చైర్మన్ పదవికి ఓసీ మహిళకు రిజర్వేషన్ కల్పించారు. దీనిపై బీసీ సంఘం జాతీయ కన్వినర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో బీసీలు అత్యధిక జనాభా ఉన్నారని, తెలంగాణ ఏర్పాటు తరువాత బీసీలకు పదవుల్లో అవకాశాలు తక్కువగా వచ్చాయని అన్నారు. ఈ నేపథ్యంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ రిజర్వేషన్ ఓసీలకు కాకుండా బీసీలకు కేటాయించాలని కోరారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి రిజర్వేషన్ మార్పుకు కృషి చేయాలని అన్నారు. తాండూరు మార్కెట్ కమిటి కొత్త పాలకవర్గంలో చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించేలా దృష్టిసారించాలని డిమాండ్ చేశారు.

