ఆడియో లీకుల్లో గుట్టంతా..!

క్రైం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఆడియో లీకుల్లో గుట్టంతా..!
– మరోసారం సంచనలమైన ఎమ్మెల్యేల ఎర
– సెంట్రల్ నుంచే డీల్ అంటూ చర్చ
– పైలెట్ రోహిత్ రెడ్డితో ఇద్దరి ముచ్చట్లు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రం, దేశ రాజకీయాలలో ప్రకంపనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర సంఘటనలో కొత్త ట్విస్టులు మరోసారి పెను సంచనాలను సృష్టించాయి. ఫాంహౌస్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి అంతకుముందు జరిగిన ఆడియోలు లీక్‌ అయ్యాయి. ఆ ఆడియో లీకుల్లో గుట్టంతా రట్టయ్యింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో రామచంద్రభారతి, సింహయాజీలు జరిపిన చర్చల సంభాషణ అంతా బహిర్గతం అయ్యింది. మొదట రామచంద్రభారతి మాట్లాడిన ఆడియో వెల్లడికాగా, కాసేపటికే రెండో ఆడియో లీక్‌ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. 27 నిమిషాల నిడివిగల ఈ ఆడియోలో నందు అనే వ్యక్తి రామచంద్రభారతి, సింహయాజి అనే ఇద్దరు స్వామీజీలతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చేసిన సంభాషణలు ఉన్నాయి. ఆ ఆడియోలోని సమాచారం ప్రకారం.. పైలట్ రోహిత్‌రెడ్డి మరో నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చర్చించుకున్నారు. పైలట్‌కు ఒక రేటు, వెంట వచ్చేవారికి మరోరేటు ఇవ్వాలని, మునుగోడు పోలింగ్‌లోపు చేరితే వంద కోట్లు ఇవ్వాలని మాట్లాడుకున్నారు. రాష్ట్ర నేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిలకు అంత ప్రాధాన్యం లేదని, ఈ అంశాలను నేరుగా సెంట్రల్‌ డీల్‌ చేస్తుందని చెప్పుకున్నారు. గుజరాత్‌ ఎన్నికల ముందు మునుగోడు కోసం ఇంత రిస్క్‌ తీసుకుంటున్నామని చర్చించుకున్నారు. ఒక్కసారి ఎంట్రీ అయితే అన్ని అమిత్‌ షానే చూసుకుంటారని, రోహిత్‌ వెంట ముగ్గురు వచ్చేందుకు రెడీగా ఉన్నారని, చేవెళ్ల, కొడంగల్‌, పరిగి ఎమ్మెల్యేలనూ టచ్‌ చేశామని, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటేనే ఆపరేషన్‌ సక్సెస్‌ అవుతుందని వారు డిస్కస్‌ చేశారు. ముందుగా నలుగురు, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఈ సందర్భంగా నందు హామీ ఇచ్చాడు.