హైకోర్టులో పైలెట్‌కు నిరాశ..!

క్రైం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

హైకోర్టులో పైలెట్‌కు నిరాశ..!
– ఈడీ విచారణ స్టే తిరస్కరణ
– వచ్చేనెల 5కు వాయిదా
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఎమ్మెల్యేల ఎర కేసు ప్రభావంతో ఈడీ చేస్తున్న దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ధీటుగా ఎదుర్కొంటున్నారు. న్యాయస్థాయాన్ని ఆశ్రయిస్తూ ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు స్టే విధించాలని హైకోర్టులో రోహిత్ రెడ్డి వేసిన రిట్‌ పిటిషన్‌పై న్యాయస్థానం ఆయన ఆశను నిరాశ పరిచింది. ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ హైకోర్టులో రోహిత్‌ పిటిషన్ దాఖలు చేసి.. నలుగురుని ప్రతివాదులుగా చేర్చారు. పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వ్యక్తిగత, కుటుంబ, ప్రైవేటు సమాచారాన్ని సేకరించేందకే ఈడీ తనను విచారిస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌ తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టుకు తమ వాదనలు వినిపించారు. ఈ విచారణను నిలిపివేయాలని కోరారు. కేవలం రోహిత్‌రెడ్డి ఫిర్యాదుదారుడు మాత్రమే, సంబంధం లేకుండా మనీలాండరింగ్‌ కేసు పెట్టి, నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని వాదనలు వినిపించారు. పార్టీ మారాలని రూ.100 కోట్లు ఆఫర్‌ చేశారని.. డబ్బులు ఇవ్వనప్పుడు మనీలాండరింగ్‌ ఎక్కడ ఉంటుందని హైకోర్టులో వాదించారు. పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం రోహిత్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.