ప్లేట్ మారితే.. ఫేట్‌ మారిపోద్ది..!

క్రైం తాండూరు వికారాబాద్

ప్లేట్ మారితే.. ఫేట్‌ మారిపోద్ది..!
– వాహనాలపై స్పెషల్ ఫోకస్

– ఇకపై ఆ తప్పులు చేస్తే కేసులే
– వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరిక
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వాహనాల తప్పుడు రవాణాపై జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టిసారించబోతోంది. ఇక నుంచి ప్లేట్ మారితే.. ఫేట్‌ మారిపోద్దని హెచ్చరిస్తున్నారు. వాహనాల తనిఖీపై జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్పెషల్ పోకస్ పెట్టారు. జిల్లాలో నేరాలు చేసి తప్పించుకునేందుకు కొంతమంది, చలాన్ల నుంచి తప్పించుకునేందుకు మరికొంత మంది నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తున్నారనే విషయాలను జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లాయి. దీంతో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ నేరస్థులు, అక్రమ కార్యకలాపాలు చేసేవారు, పోలీసుల నుంచి తప్పించుకొని తిరిగే నేరగాళ్లు తమ గుర్తింపు దొరకుండా ఉండేందుకు నెంబర్ పెట్లు లేని వాహనాలు, తప్పుడు నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు వినియోగిస్తున్నారన్నారు. ఇకపై వికారాబాద్ జిల్లా పరిధిలో వాహనాల నెంబర్ పెట్ల పైన రోజూ తనిఖీలు ఉంటాయని తెలిపారు. నెంబర్ ప్లేట్ కనబడకుండా మాస్కులు పెట్టడం, నెంబర్లు మార్చడం, ఒక నెంబర్ను తొలగించడం, నెంబర్ పెట్లను వంచడం చేస్తున్నారని, చట్టప్రకారం వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని పోలీస్ అధికారులందరు కూడా ఇట్టి విషయం పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.