డేంజర్ మాంజా విక్రయాలపై పంజా..!
– జిల్లాలో రూ. 2.97 లక్షల చైనా మాంజా సీజ్
– వినియోగంతో పక్షలకు, పిల్లలకు ప్రమాదకరం
– విక్రయాలు చేస్తే చర్యలు: జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: పక్షులకు, పిల్లల పాలిట డేంజరస్‌గా మారిన ప్రభుత్వ నిషేధిత చైనా మాంజా విక్రయాలపై వికారాబాధ్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి రూ. 2లక్షల 97 వేల 500ల విలువైన చైనా మాంజాను సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్లాస్టిక్ దారంకు గాజుపొడి అద్ది తయారు చేసే చైనా మాంజాలు ప్రమాద కరమైనవి తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లాలో నిషేధిత చైనా మాంజాల విక్రయాలు జొరందుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో టాస్క్ ఫోర్స్ ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విక్రయాలపై నిఘా ఉంచడం జరిగిందని చెప్పుకొచ్చారు. శుక్రవారం వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 81 డబ్బాల చైనా మంజా సుమారు 2,02,500 రూపాయల మంజా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కోడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 38 డబ్బాలపై దాడులు జరిపి సుమారు 95,000 రూపాయల చైనా మంజా పట్టుకోవడం జరిగింది వెల్లడించారు.

ప్లాస్టిక్ పదార్థంతో తయారయ్యే దారం కావటంతో గట్టిగా, పదునుగా ఉండే ఈ మాంజా వల్ల ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో పక్షులతో పాటు పిల్లలూ గాయపడుతున్నారని అన్నారు. ప్లాస్టిక్ దారంకు గాజుపొడి అద్ది తయారు చేస్తారు కావున దీనివలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఎవరైనా ఎక్కడైనా విక్రయాలు చేపడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా పెద్దలు ఈ డేంజరెస్ చైనా మాంజా పట్ల పిల్లలలో అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపైనా వెళ్ళే సమయం లో జాగ్రత్తగా ఉండాలన్నారు.

