పంతం వైపా.. ప్రగతి వైపా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పంతం వైపా.. ప్రగతి వైపా..!
– హీటెక్కిస్తున్న కౌన్సిల్‌ మీటింగ్
– అసక్తిగా ఎదురుచూస్తున్న నేతలు, ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని మున్సిపల్ పరిపాలన విభిన్నంగా కొనసాగుతోంది. నిత్యం వర్గ పోరు, కోర్టు కేసులతో కాలం వెల్లదీస్తోంది. పంతాలు పట్టింపులతో పట్టణ అభివృద్ధి పక్కకు పారిపోయిందని విమర్శలు మూటగట్టుకోంది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇన్నాళ్లకు ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ కౌన్సిల్‌ సమావేశం మళ్లీ పోలిటికల్ హీటెక్కిస్తోంది. సమావేశం సవ్యంగా జరుగుతుందా.. మళ్లీ పంతాలకు పోతారా..? ప్రగతి వైపు నిలుస్తారా..? అని సామన్యులు అసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్సీ వర్గానికి చెందిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, ఎమ్మెల్యే వర్గానికి చెందిన పట్లోళ్ల దీపా నర్సింలు వర్గాల మద్య వర్గపోరు జరుగుతోందని అందరికి తెలిసిన విషయమే. గత యేడాది ఇదే జనవరిలో 48 అంశాలతో రూపొందించిన మున్సిపల్ కౌన్సిల్ ఎజెండా ఇరు వర్గాల మద్య చిచ్చును రేపింది. ఈ ఎజెండాపై చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ కోర్టుకు వెళ్లడంతో వివాదం తీవ్రమైంది. హక్కుల కోసం కోర్టుకు వెళ్లానని చైర్ పర్సన్ పేర్కొనగా.. స్వార్థం కోసం పట్టణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మరో వర్గం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న దాఖాలు అనేకం ఉన్నాయి. కోర్టు వ్యవహారాల వల్ల మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల పెంచిన వేతనాలు, పట్టణ అభివృద్ధి స్థంభించి పోయింది. చివరకు మున్సిపల్ సమావేశాలు నిర్వహించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మున్సిపల్ కౌన్సిలర్ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ మున్సిపల్ సమావేశం సవ్యంగా జరుగుతుందా లేదా అని అందరికి ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కొందరు సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకుంటే.. మరికొందరు సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు సమావేశానికి గైర్హాజరు అయ్యేందుకు విహార యాత్రకు వెళ్లాలని అనుకున్నారు. నేతలు వారిని బుజ్జగించి అడ్డుకున్నట్లు సమాచారం. మరి నేడో రేపో.. మరుసటి రోజో జరిగే సమావేశంలో పంతానికి పోతారో.. ప్రగతి వైపు నిలుస్తారో అని ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ వర్గీయులు డుమ్మా కొట్టినా.. ఎమ్మెల్యే వర్గీయులు డుమ్మా కొట్టినా మెజార్టీలో ప్రతిపక్ష కౌన్సిలర్లు కీలకంగా మారుతున్నారు.