డ్రైనేజీ పొంగొచ్చిన కష్టం..!
– కాంప్లెక్స్‌లో చేరిన మురుగునీరు
– ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యాపారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లిన డ్రైనేజీతో వ్యాపారులకు కష్టాలు కొట్టోచ్చాయి. కాంప్లెక్స్‌లోకి మురుగునీరు రావడంతో వ్యాపార నష్టంతో పాటు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలోని హరికృష్ణ కాంప్లెక్స్‌లో చోటు చేసుకుంది. కోడంగల్ రోడ్డుమార్గంలో ఈ కాంప్లెక్స్ ఉంది. కాంప్లెక్స్ సమీపంలో ఉన్న డ్రైనేజీ ఉంది. ఈ డ్రైనేజీపై కొందరు గత కొన్నేండ్ల నుంచి డబ్బాలను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ కారణంగా డ్రైనేజీలు శుభ్రం కావడంలేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో డ్రైనేజి నిండి పొంగిన నీరంతా కాంప్లెక్స్‌లోకి రావడంతో పాటు పలు దుకాణాలలోకి నీరు చేరింది. దీంతో అందులో ఉన్న వస్తువులు, సామాగ్రి తడిసి ముద్దయిపోయాయి. కాంప్లెక్స్‌లోకి చేరిన నీటిని వ్యాపారులు బోరు మోటారు ఏర్పాటు చేసి బయటకు తరలించే చర్యలు తీసుకున్నారు. డ్రైనేజీ పొంగడంతో దుకాణాలలో నీరు చేరి నష్టం వాటిళ్లిందని వ్యాపారులు ఆవేధన వ్యక్తం చేశారు. డ్రైనేజీపై వెలసిన నిర్మాణాలను తొలగించి సమస్యను పరిష్కరించేలా చూడాలని వ్యాపారులు అధికారులను కోరారు.


