అభివృద్ధి ఎజెండా అట్టర్ ఫ్లాప్
– తన గుంతను తనే తవ్వుకున్న చైర్ పర్సన్
– నిధుల కేటాయింపులో పక్షపాతం
– 6అంశాల వ్యతిరేకలో ప్రజా విజయం
– మున్సిపల్ వైస్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో భారీ బడ్జెట్తో ప్రవేశ పెట్టిన అభివృద్ధి ఎజెండా అట్టర్ ఫ్లాఫ్ అయ్యిందని వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. బుధవారం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశం అనంతరం వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కాంగ్రెస్, ఎంఐఎం కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడారు. గత యేడాది హక్కుల కోసమంటూ ఎజెండాపై కోర్టుకు వెళ్లిన చైర్ పర్సన్ తాజాగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. భారీ అంచానాలతో ప్రవేశ పెట్టిన అభివృద్ధి ఎజెండా అట్టర్ ఫ్లాప్ గా నిలిచిందన్నారు. పట్టణ అభివృద్ధి కోసం నిధుల కేటాయింపులో చైర్ పర్సన్ ఎమ్మెల్సీ వర్గం, ఎమ్మెల్యే వర్గం అనే విధంగా వివక్ష చూపించారని విమర్శించారు. ఇన్నాళ్లు ఎమ్మెల్యే వర్గం అభివృద్ధిని అడ్డుకుందని విమర్శించిన చైర్ పర్సన్ ఎమ్మెల్యే అనుకూల కౌన్సిలర్లకు నిధుల కేటాయింపులో వివక్ష చూపిచండంతో వర్గపోరు ఎవరు పెంచి పోషిస్తున్నారని ప్రజలకు అర్థమవుతుందన్నారు. గతంలో కోర్టుకు వెళ్లిన అంశాలలో 9 కోట్ల అభివృద్ధి పనులు ఉంటే తాజాగా ప్రవేశ పెట్టిన ఎజెండాలో 14 కోట్లకు ప్రణాళికలు రూపొందించడం ఆమెకే చెల్లిందన్నారు. తన గుంతను తానే తవ్వుకున్నట్లుగా చైర్ పర్సన్ వ్యవహార శైలి కొనసాగిందన్నారు. పారదర్శకత పాటించకుండా గర్వాన్ని చూపించుకునేందుకు మోసపూరితను ప్రదర్శించారని అన్నారు. ఎన్నడు లేని విధంగా జీరో అవర్ను పెట్టి కాలయాపన చేశారన్నారు. అన్ని అంశాలను ఆమోదం తెలుపుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని అన్నారు. మెజార్టీ కౌన్సిలర్ల సంఖ్యను చూపించుకునేందుకు 1వ వార్డు ప్రవేశ బీజేపీ కౌన్సిలర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. 10, 11, 13, 34, 37, 41కు సంబంధించి బడ్జెట్ లేకుండా ప్రవేశ పెట్టిన ఆ 6 అంశాలను వ్యతిరేకించడం జరిగిందని, మిగతా అంశాలలో కార్మికుల వేతనాలు. న్యాయబద్ధమైన అంశాలను ఆమోదించడం జరిగిందన్నారు. దీంతో ప్రజా విజయాన్ని సాధించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, విజయ దేవి, లతా గౌడ్, సింధూజ గౌడ్, సంగీత ఠాకూర్, ఆసిఫ్, ప్రభాకర్ గౌడ్, అస్లాం, ముక్తార్, అశ్విని గుండప్ప, ఎర్రం వసంత, బొంబీనా తదితరులు పాల్గొన్నారు.
“ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు”
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కార్మికుల వేతనాలకు సంబంధించిన అంశం ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాలను అమలు చేయడంలో చొరవ చూపిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు నరేందర్ గౌడ్, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు న్యాయవాది గోపాల్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

