31న తాండూరు కందికి జీఐ గుర్తింపు పురస్కారం
– హాజరు కానున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
– ఏర్పాట్లు సిద్దం చేసిన పరిశోధన స్థానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఈనెల 31న తాండూరు కందికి జీయోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు పురస్కారం అందించడం జరుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్ర వేత్త డా. సుధాకర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఆయనతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ కె. నిఖిల, వ్యవసాయ శాఖ అధికారులు, నేతలు పాల్గొంటారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో తాండూరు కందికి జీఐ గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాండూరు కందికి లభించిన జీఐ గుర్తింపు పురస్కారాన్ని అందించనున్నారు.

