పోలీసుల కస్టడీకీ మురళీకృష్ణ..?

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పోలీసుల కస్టడీకీ మురళీకృష్ణ..?
– రేపు యాలాల పోలీస్టేషన్‌లో విచారణ
– చర్చనీయాంశమైన శివస్వాముల ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీజేపీ జిల్లా నాయకులు మురళీకృష్ణ గౌడ్ పోలీసుల కస్టడికి అందించేందుకు ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. గత నెలలో యాలాల మండలంలో జరిగిన శివ స్వాముల ఘటనలో మురళీకృష్ణ గౌడ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను యాలాల పోలీసుల కస్టడీకి అప్పగించినట్లు ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. దీంతో మురళీకృష్ణ గౌడ్‌ను రేపు మంగళవారం యాలాల పోలీస్టేషన్‌లో సుదీర్ఘ విచారణ చేయనున్నట్లు తెలిసింది. అసలేం జరిగిందో మరోసారి వివరాల్లోకి వెళితే.. గత నెల జనవరి 30వ తేదీన యాలాల మండలం దేవనూర్ గ్రామంలో గ్రామానికి చెందిన శివ మాల ధరించిన స్వామి నరేందర్, అదే గ్రామానికి చెందిన మెట్ల నరేష్‌తో వాగ్వివాదం జరగడంతో వివాదంగా మారింది. దీనిపై నరేందర్ మరుసటి రోజు ఉదయం యాలాల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా రోడ్డులో దాదాపు 100 మంది శివస్వాములు ఆందోళనకు దిగారు. శివ మాలను అవమాన పరిచిన నిందితుడును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో నిందితుడు నరేష్‌ యాలాల వెళ్లినట్లు తెలుసుకుని అక్కడ నరేష్‌ పోలీస్టేషన్‌లో ప్రాణరక్షణ కోసం లోపటికి వెళ్లినా శివ స్వాములు మూకుమ్ముడిగా దాడి చేశారు. అయితే నరేష్‌ అందించిన ఫిర్యాదులోని నిందితులు బొక్కె నరేందర్, నరేందర్ గౌడ్, అరవింద్ గౌడ్, శివకుమార్, గణేష్‌లను పోలీసులు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్‌ నివాసంలో అరెస్టు చేశారు. కేసు విచారణలో నిందితులు నరేష్‌పై దాడి ఘటనలో మురళీకృష్ణ గౌడ్‌కు సంబంధం ఉన్నట్లు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈమేరకు మురళీకృష్ణ గౌడ్‌ను కూడ పోలీసులు అరెస్టు చేసి అదే రోజు రిమాండుకు తరలించారు.