మార్వాడి యువమంచ్ సేవా స్పూర్తి..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

మార్వాడి యువమంచ్ సేవా స్పూర్తి..!
– టీబీ రోగులకు నూట్రీషన్ కిట్లు
– ప్రతిభ విద్యార్థులకు సత్కారం
– పాఠశాలకు క్రికెట్ కిట్ వితరణ
– ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించే మార్వాడి యువమంచ్ మరోసారి సేవా స్పూర్తిని చాటుకుంది. శుక్రవారం మార్వాడి యువమంచ్ 39వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టి పేదల మనసు దోచి మానవత్వాన్ని నిలుపుకుంది. దేశంలో అన్ని రాష్ట్రాలను, జిల్లాలను టీబీ రహితంగా మార్చేందుకు ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ లో భాగంగా జిల్లా ఆరోగ్యశాఖ అధికారి అరుణ్ కుమార్, జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డా.రవీంద్ర యాదవ్ ల అభ్యర్థన మేరకు 5 మంది టీబీ రోగులకు ఆరు నెలలకు సరిపడా నూట్రీషన్ కిట్లను అందజేశారు.

అదేవిధంగా పెద్దేముల్ మండలం మారేపల్లి పాఠశాలకు గతంలో ఇచ్చిన హామీ మేరకు క్రికెట్ కిట్ ను వితరణ చేశారు. దీంతో పాటు కేజీబీపీ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని మహేశ్వరి సాంఘీక శాస్త్రంలో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం, అదే పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని గాయిత్రి జాతీయ అథ్లెటిక్స్ లో ఎంపిక కావడం పట్ల మార్వాడి యువమంచ్ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు.

అంతకుముందు మార్వాడి యువమంచ్ 39వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బాలాజీ మందిరంలో మంచ్ మాజీ అధ్యక్షులు సన్ని అగ్రవాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజ హితం కోసమే మార్వాడి యువమంచ్ ఏర్పాటై అఖిల భారతదేశమంతా విస్తరించిందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మార్వాడి యువమంచ్ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, తాండూరు శాఖ అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ రాఠీ, కోశాధికారి అరుణ్ సార్డా, ఉపాధ్యక్షులు అనిల్ , ఆశిష్ సార్డా, సహ కార్యదర్శులు కరణ్ జైన్, శ్రీగోపాల్ రాఠీ, పవన్ సోని, దీపక్ గగ్రాని, మ హేష్ సార్డా, సన్ని అగ్రవాల్, దీనేష్ పర్తాని, రమాకాంత్ పండిత్, లక్ష్మీనారాయణ బూబ్, మధు సోని, ముఖేష్ సోమాని, సూర్య ప్రకాష్ సోమాని, సమాజం పెద్దలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.