కొత్త బస్సులు కేటాయించండి
– వికారాబాద్, తాండూరుకు వేస్తే మేలు
– ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు డీపోలకు కొత్త బస్సులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఎండీ సజ్జనార్‌ను రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ కోరారు. బుధవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్(ఐపీఎస్)ను హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో శుభప్రద్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరు, వికారాబాద్ డీపో పరిధిలో ఉన్న సమస్యలను సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. తాండూరు, వికారాబాద్ నుంచి నిత్యం వేలాది మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారని తెలిపారు. కాలం చెల్లిన పాత బస్సులు నిత్యం మోరాయిస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారని అన్నారు. ముఖ్యంగా అనంతగిరి ఘాట్ వద్ద ప్రమాదాలు అవుతున్నాయని గుర్తుచేశారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలోని బస్సు సౌకర్యం లేని గ్రామాలకు బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకవచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త బస్సులు, సర్వీసులు పెంచితే ప్రయాణికులకు ఎంతో మేలు జరగడంతో పాటు ఆర్టీసీకి లాభదాయకంగా ఉంటుందని సజ్జనార్‌తో పేర్కొన్నారు. ఇందుకు సజ్జనార్ వెంటనే సానుకూలంగా స్పందించి త్వరలోనే కొత్త బస్సులు రాబోతున్నాయని, అవి వచ్చిన వెంటనే కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని శుభప్రద్ పటేల్ తెలిపారు. అంతేకాకుండా బస్సు సర్వీసులు లేని గ్రామాలకు బస్సులు వేయిస్తామని చెప్పినట్లు శుభప్రద్ పటేల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

