ఆ వైద్యమే విషమైంది..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ఆ వైద్యమే విషమైంది..!
– చేతి స్పర్శ కోల్పోయిన బాలింత
– ఎంసీహెచ్ వైద్య సిబ్బందే కారణమన్న కుటుంభీకులు
– చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ కు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలోనే ఉత్తమ ప్రసూతి సేవలు అందిస్తున్న తాండూరు మాతా శిశు ఆసుపత్రి వైద్య సేవలు ఓ బాలింత పాలిట శాపంగా మారింది. ప్రసవం కోసం గర్భిణీగా వచ్చిన ఆమెకు వైద్య సిబ్బంది అందించిన చికిత్స కారణంగా కుడి చేతి స్పర్శను కోల్పోవడంతో పాటు చేతి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం బొంరెడ్డిపల్లికి చెందిన హరిజన్ శ్రీనివాస్‌కు కోస్గి మండలం కడంపల్లికి చెందిన పార్వతమ్మతో వివాహము జరిగింది. ఆమె గర్భం దాల్చడంతో పురుడు కోసం తల్లిగారి ఊరు అయిన కడంపల్లికి వెళ్లింది. గత జనవరి 17వ తేదినా నొప్పులు రావడంతో అంబులెన్స్ లో తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రికి వచ్చింది. ఉదయం వైద్య సిబ్బంది అడ్మిన్ చేసుకున్నారు. మధ్యాహ్నం పార్వతమ్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం తరువాత పార్వతమ్మ కుడి చేతికి స్పర్శ కోల్పోయింది. మరుసటి రోజు వైద్యులు ఆమెను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కొద్ది రోజుల తరువాత కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పార్వతమ్మ చేతికి ఇను ఫెక్షన్ సోకిందని అనుమానించారు. దీంతో సోమవారం బాధిత కటుంబ సభ్యులు బాలింతతో కలిసి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ తో కలిసి పరిస్థితి వివరించారు. ప్రసవం రోజున వైద్య సిబ్బంది ఇంజక్షన్ ఇవ్వడంతో చేతి పరిస్థితి విషమంగా మారిందని ఆరోపించారు. ఈ పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూడాలని ఫిర్యాదు చేశారు. బాధితురాలి వెంట భర్త శ్రీనివాస్, కుటుంబ సభ్యులు ఉన్నారు.