నల్లా ట్యాక్స్ కట్టకుంటే కనెక్షన్‌ కట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నల్లా ట్యాక్స్ కట్టకుంటే కనెక్షన్‌ కట్..!
– హెచ్చరించి.. ఆచరిస్తున్న బల్దియా
– పట్టణంలో మూడిండ్లకు తొలగింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంత వరకు ఇంటి నల్లా ట్యాక్స్ కట్టలేదా.. వెంటనే పన్నులు చెల్లించండి. లేదంటే అధికారులు నల్లా కనెక్షన్‌ కట్ చేస్తారు జాగ్రత్త. తాండూరు పట్టణ వాసులుకు మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ట్యాక్స్ కట్టని వారి ఇళ్లకు నల్లా కనెక్షన్‌ కట్‌ చేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మున్సిపల్లో ప్రత్యేక బృందాలతో ఆస్తిపన్నుల వసూళ్లను చేపడుతున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్నుతో పాటు కుళాయి పన్నులు బకాయిలు పడ్డ వారిపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. మొండి బకాయిదారులతో నుంచి పన్నులు వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా మున్సిపల్ పరిధిలో మూడు ఇండ్లకు ఉన్న కుళాయి కనెక్షన్లను తొలగించారు. పట్టణంలోని ఇంటి నెంబర్ 3-1-36తో పాటు 37 నెంబర్ గల ఇండ్ల యజమానులు మూడు సంవత్సరాల నుంచి రూ. 17,072లు ఆస్తిపన్ను బకాయి ఉన్నారు. అదేవిధంగా ఇంటి నెంబర్ 4-2-108 ఇంటి యజమాని 2019 నుంచి ఆస్తిపన్ను రూ. 18,308, 2014 నుంచి కుళాయి పన్ను రూ. 14,500లు బకాయి ఉన్నారు. నోటీసులు అందించినప్పటికి బిల్లులు చెల్లించడంతో వారి ఇండ్లకు సంబంధించిన నల్లా కనెక్షన్లను అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కుళాయి బకాయిలు, ఆస్తిపన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని సూచించారు.