తలుపులు విరగొట్టి..!
– పగలే చోరీ చేసిన దొంగలు
– తాండూరు సాయిపూర్ కాలనీలో ఘటన
– దొంగలు ఏమేం ఎత్తుకెళ్లారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి: సెలవులు వచ్చినా, పండగలు వచ్చినా గుట్టు చుట్టుపులా వచ్చే దొంగలు తమ పనికానిచ్చేస్తున్నారు. ఇంటికి తాళం ఉంటే.. ఎవరైనా ఊరేళితే.. గమనించి చక్కగా తస్కరించేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ కాలనీలో కొందరు గుర్తుతెలియని దొంగలు చోరీకి తెగబడ్డారు. పట్ట పగలే ఈ సంఘటన జరిగింది. తాండూరు పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిపూర్ కాలనీలో నివాసం ఉండే రమేష్ గురువారం ఉదయం పనిమీద బయటకు వెళ్లాడు. మధ్యాహ్నంకు ముందు అతని భార్య ఇంటికి తాళం వేసి అమ్మమ్మ గారింటికి వెళ్లింది. సాయంత్రం తిరిగి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు, తలుపులు విరగొట్టి కనిపించాయి.
వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు అనుమానాస్పదంగా కనిపించాయి. లోపల ఉన్న బీరువా కూడ తెరిచేఉంది. బీరులో ఉన్న 20 తులాల వెండి, రూ. 14 వేల నగదు మాయం అయ్యింది. దీంతో కుటుంభీకులు తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని పోలీసులు నిర్దారించారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు పట్టణంలోని మల్ రెడ్డి ప్రాంతంలో మరో భారీ చోరీ జరిగినట్లు పుకార్లు వచ్చాయి. దానికి పోలీసులు ఎలాంటి క్లారీటీ ఇవ్వలేదు.

