వారంలో ఐదు రోజులే
– బ్యాంకు పనిదినాలు తగ్గింపు
– ఆమోద ముద్ర వేయనున్న కేంద్రం
దర్శిని ప్రతినిధి: చాలా రోజులుగా బ్యాంకు ఉద్యోగులు పని దినాలను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వం ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వేజ్ బోర్డులో సవరణలు చేసి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు మీడియా కథనాలు తెలిపాయి. తాజాగా కేంద్రం దీనికి అంగీకరించేందుకు దృష్టిసారిస్తోంది. దీనికి ఆమోద ముద్ర లభిస్తే బ్యాంకు ఉద్యోగులకు పండగే. ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగులు రెండో, నాల్గో శనివారాలు సెలవు తీసుకుంటున్నారు. ప్రతీ నెలా మొదటి, మూడో శనివారాల్లో బ్యాంక్‌లు తెరిచి ఉంటున్నాయి. వారానికి ఐదు రోజుల పని పద్ధతి పై ఇంతకుముందే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయి. అయితే ఫైవ్ డే వర్క్ వీక్‌కు బదులుగా బ్యాంక్ సిబ్బందికి రోజుకు 40 నిమిషాలు పనివేళలు పెరుగుతాయని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ బ్యాంక్‌లు.. తమ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిని అనుమతించనున్నాయి. త్వరలో ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేయనుంది. ఒక వేళ ఈ విధానం అమల్లోకి వస్తే.. బ్యాంకు ఉద్యోగులు ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు బ్యాంకులో పనిచేయాల్సి వస్తుంది.

