టమాటాల గిప్టే.. బెస్ట్..!
– బర్త్ డే కానుకగా టామాటాలు
– సోషల్ మీడియాలో వైరల్ అయిన సంఘటన
దర్శిని డెస్క్: పెళ్లిళ్లకు, పుట్టిన రోజుల వేడులకు ఎవరైనా విలువైన వస్తువులు, ఆకర్షణీయమైన వస్తువులు, మోబైల్ ఫోన్లు, రింగులో గిఫ్టులుగా ఇస్తుంటారు. అయితే మారుతున్న కాలంలో నేటి తరం ట్రెండింగ్‌లో ఉన్న వస్తువులను కానుకలుగా అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో గృహిణులు ఆచితూచి టమాటాలను వినియోగిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే కేజీ టమాట ధర రూ.20 నుంచి రూ.160కి చేరింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా రూ.200 మార్కునుకూడా దాటేసింది. ఈ క్రమంలోనే టమాటాలు కూడా విలువైన వస్తువుల జాబితాలో చేరిపోయాయి. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ కావడంతో టమాటాలను గిఫ్టులుగా ఇచ్చి తీసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ మహిళ పుట్టిన రోజు వేడుకలకు టమాటాలను గిఫ్ట్‌గా ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
మహారాష్ట్రలోని కళ్యాణ్‌లోని కొచ్చాడి ప్రాంతానికి చెందిన సోనాల్ బోర్స్ అనే మహిళ ఆదివారం (జులై 9) నాడు తన పుట్టిన రోజు జరుపుకుంది. అతని సోదరుడు గౌతమ్ వాఘ్, అత్తామామలు 4 కిలోల టమాటాలను ఓ బుట్టలో తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చారు. గిఫ్ట్‌గా వచ్చిన టమాటాలను చుట్టూ పెట్టుకుని సోనాల్ కేక్ కట్ చేసింది. ఇక టమాటాలను బహుమతిగా అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇంతకంటే మంచి బహుమతి ఇంకేం ఉంటుందని సోనాల్ ఆనందం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి…


