లెట్స్‌.. వెయిట్ అండ్ సీ…!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

లెట్స్‌.. వెయిట్ అండ్ సీ…!
– నేడే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్..?
– 11-05 గంటలకు విడుదల
– ప్రగతి భవన్‌ నుంచే ప్రకటించనున్న గులాబీ బాస్
– తేలనున్న అసంతృప్తుల ఫ్యూచర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల సమరం సమీపిస్తుండడంతో బీఆర్ఎస్‌లో పోలిటికల్ కోలాహలం ప్రారంభమయ్యింది. అభ్యర్థుల ప్రకటన ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్టును నేడు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. శ్రావణమాసం పంచమి సెంట్‌మెంట్‌తో నేడు ఉదయం 11-05 గంటలకు కసరత్తు జాబితాను ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో విడత జాబితా ఈ నెల 25న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. 2018 ఎన్నికల సమయంలో ఒకేసారి 105 మందితో మొదటి జాబితాను ప్రకటించారు. ఈ దఫా 87 మందితో తొలి జాబితా ఉంటుందని ప్రచారం జరిగినా.. ఇంకా ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శాసనసభ ఎన్నికలు డిసెంబరులో జరిగే అవకాశాలుండడంతో వంద రోజులుగా ముందుగానే అభ్యర్థులను వెల్లడించాలని అధినేత కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. కేసీఆర్‌ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక మళ్లీ రాత్రి వరకు అభ్యర్థుల ఎంపికపై కొందరు మంత్రులతో చర్చించినట్లు సమాచారం. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా టికెట్ల విషయమై సీఎంను కలిసినట్లు తెలుస్తోంది.

టిక్కెట్టు వచ్చేదెవరికో.. వదులుకునే వారెవరో..?
ఈ సారి బీఆర్ఎస్‌ నుంచి ఆశావాహుల పోటీ పెరగడంతో బుజ్జగింపుల పర్వం అధికమైంది. దీంతో టిక్కెట్టు ఎవరిని వరిస్తుందో.. వదులుకునేదెవరో అనే టెన్షన్ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో 10 నుంచి 15 మంది సిట్టింగులకు టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు అనుమానమే అనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ నుంచి 12 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరికి టిక్కెట్టు ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు సిట్టింగ్‌లకు కూడా అవకాశం కల్పించడం లేదని చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల మార్పులు ఉండవని చెబుతున్నా.. జాబితా ప్రకటించే వరకు కొన్ని స్థానాలపై సస్పెన్స్‌ కొనసాగనుంది. ఉమ్మడి అదిలాబాద్‌ నుంచి ముగ్గురు, కరీంనగర్‌ నుంచి ఒకరిద్దరు, వరంగల్‌ నుంచి ముగ్గురు, ఖమ్మం నుంచి ఇద్దరు, నల్గొండ నుంచి ఇద్దరు, మహబూబ్ నగర్‌ నుంచి ఇద్దరు, మెదక్ నుంచి ఇద్దరు, హైదరాబాద్‌ నుంచి ఒకరు నిరాకరించే జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పలు దఫాలుగా సర్వేలు, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాలు, బలహీనతలు, ప్రత్యర్థుల బలాలు.. ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఖరారు చేసిన పేర్లను వీలైనంత ముందుగా ప్రకటించాలన్నది పార్టీ వ్యూహం.

టికెట్లు ఖరారైతే.. ఆశావహులు టికెట్ల కోసం పోటీపడటం మానేసి ఎన్నికల్లో పనిచేయడంపై దృష్టిపెడతారని, ఎక్కడైనా సమస్యలున్నా సర్దిచెప్పడానికి సమయం ఉంటుందని భావిస్తున్నట్లు తెలిసింది. అత్యధిక స్థానాల్లో సిట్టింగులకే మరోమారు అవకాశం కల్పించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. మరీ తప్పని పరిస్థితుల్లోనే అభ్యర్థిని మార్చే అవకాశాలున్నాయని, ఈ విషయాన్ని ఆయా అభ్యర్థులకు తెలిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అసంతృప్తులను బుజ్జగించడంపై మంత్రులతో సీఎం చర్చించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలను తప్పనిసరిగా మార్చాల్సిన పరిస్థితుల్లో.. వారికి భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!