కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించుదాం..!
– ఇచ్చిన హామిలన్నీంటి అమలులో విఫలం
– 2023లో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ రెండింటిపైనే తొలిసంతకం
– ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బండి సంజయ్ ధ్వజం
హైదరాబాద్, దర్శని ప్రతినిధి: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ నాయకులందరు పోరాటం చేయాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం హుస్నాబాద్‌లో ఇవాళ జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ప్రసంగిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. అధికారం చేపట్టిన నాటి నుంచి తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయకుండా సర్పంచ్‌లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూంలపై న్యాయం చేయలేకపోయారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణలో ప్రజలు, రైతులుు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణలో పూర్తయిన ప్రాజెక్టుల వల్ల రైతుల పంటపొలాలకి నీళ్లు రావడం లేదని, ఈ ప్రాజెక్టులు ఎవరి స్వలాభం కోసం కడుతున్నారని ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఉన్న భూములను లాక్కుంటుందని ఆరోపించారు. కొత్త ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరైనా మొదటి సంతకం ఉచిత విద్య, వైద్యం పైనే ఉంటుందని బండి సంజయ్ ప్రకటించారు.
టీఆర్ఎస్ బాక్సు బద్దలైపోవడం ఖాయం
అదేవిధంగా రాష్ట్రంలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలపై బండి సంజయ్ మాట్లాడారు. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఫలించబోవన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు వచ్చిన కార్యకర్తలను చూస్తే ‘మీ జోష్ చూస్తుంటే 2023లో అధికారం బీజేపీదే అని అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ బాక్స్‌లు బద్దలే.’’ అని అన్నారు. హుజురాబాద్ ఎన్నికతోనే రాష్ట్రంలో మార్పు మొదలవబోతోందని వ్యాఖ్యానించారు.

