రికార్డు సీట్లు సాధించి తీరాలి..!

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రికార్డు సీట్లు సాధించి తీరాలి..!
– మునుపటి కన్నె ఎక్కువ స్థానాలే లక్ష్యం
– బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో మరింత దూకుడు
– ప్రతి నియోజకవర్గంలో ఇద్దరిద్దరికి బాధ్యతలు
– అసంతృప్తి జ్వాలలు చల్లారి పోవాలి
– బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: వచ్చేఎన్నికల్లో తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, రికార్డు స్థానాలను దక్కించుకుని మునుపటి కన్నా ఎక్కువ సీట్లు గెలిచి సత్తా చాటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) ఉద్ఘాటించారు. గురువారం తెలంగాణ భవన్‌లో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ 23వ ఆవిర్భావం సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా అవతరించిన పార్టీ అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని తెలిపారు. మన రాష్ట్రంలోని పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కానీ, తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదు? ప్రశ్నించారు. భారాస అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదని అన్నారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా గెలుస్తామని అన్నారు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు సాధించడమే ప్రాధాన్యతాంశమని శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్ దిశా నిర్దేశం
భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలని వారికి సూచించారు. నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను దూకుడుగా చేపట్టాలన్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలన్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి తమ క్యాడర్‌లో నెలకొంటున్న అసంతృప్తి భావాలను తగ్గించాలని సూచించారు. దీంతో పాటు అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలన్నారు. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటాం. మార్క్ ఫెడ్‌కు ఈ మేరకు ఆదేశాలిస్తామన్నారు. మరోవైపు కొన్ని గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటి సర్వే నంబరు కేటాయించి అప్పగించాలన్నారు. అట్టి స్థలాల్లో పేదలు ఇళ్లు కట్టుకోవటానికి యోగ్యంగా వుంటే వాటిని తక్షణం పంచేద్దామన్నారు. వీటితో పాటు మరిన్ని సలహాలు, సూచనలు అందజేశారు.