ర్యాలీలు, మీటింగ్‌లకు రూల్స్‌ మస్ట్‌

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ర్యాలీలు, మీటింగ్‌లకు రూల్స్‌ మస్ట్‌
– నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
– ఎన్నికల నియామళీ ఎలా ఉంటుందంటే..?
దర్శిని డెస్క్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఎలక్షన్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరిగే పనులను పర్యవేక్షించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది. కోడ్‌ అమలులో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజలు అనుసరించాల్సిన నియమాలను ప్రకటించింది. ఇవి పాటించేకుండా చర్యలు తప్పవని హెచ్చరించింది. మరి ఎన్నికల కోడ్‌లో పాటించాల్సిన నియమాలను కింద తెలుసుకోండి.

కులం, మతం పేరుతో చిచ్చు పెట్టొద్దు. సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడొద్దు. కొత్తగా విభేధాలు, వైషమ్యాలు సృష్టించేలా వ్యవహరించొద్దు.
రాజకీయ నేతలు, పోటీ చేసే అభ్యర్థులు, పార్టీల కార్యకర్తల వ్యక్తిగత జీవితాల గురించి ప్రస్తావించొద్దు. ప్రజలతో సంబంధం లేని వ్యవహారాల జోలికి పోవద్దు.
ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వారి విధానాలు, కార్యక్రమాలు, గతంలో పనితీరు వంటి అంశాలకు మాత్రమే పరిమితం కావాలి. అసత్య ఆరోపణలు చేయకూడదు.

ఎన్నికల ప్రచారం కోసం ప్రార్థనా మందిరాలను ఉపయోగించరాదు. ఓట్ల కోసం కులాభిమానం, మత విశ్వాసాలను వాడుకోకూడదు.
ఓటర్లకు డబ్బులివ్వడం, బెదిరించడం, ఒకరి ఓటు మరొకరు వేయడం, పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం వంటివన్నీ నిషిద్ధం.
పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటలలోపు బహిరంగ సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధం.
పోలింగ్‌ కేంద్రానికి ఓటర్ల రవాణాకు ఏర్పాట్లు చేయడం నిబంధనలకు విరుద్ధం.

పార్టీలు, అభ్యర్థులు ఇతరుల స్థలం, గోడలు, ఇండ్లు, ఇతర వేదికలను అనుమతి లేకుండా ప్రచారానికి వాడుకోవడం నిషిద్ధం.
ఇతర పార్టీలకు చెందిన, అభ్యర్థులకు చెందిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిని తొలగించడానికి వీల్లేదు.
ఇతర అభ్యర్థుల సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను అడ్డుకోరాదు.
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత నగదు తరలింపుపై ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఒక వ్యక్తి సగటున రూ.50 వేలలోపు మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. అంతకుమించి తమతో తీసుకెళ్తే అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు తప్పనిసరిగా వారివెంట ఉండాలి. లేనిపక్షంలో ఆ నగదును సీజ్‌ చేస్తారు.

మీటింగ్‌లకు పర్మిషన్ కంపల్‌సరీ..
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమావేశాల నిర్వహణకు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. సమావేశంలో లౌడ్‌ స్పీకర్లు వాడితే అందుకు తగిన సమాచారం ముందుగానే ఇవ్వాలి. అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు ఎన్నికల ప్రచారం చేయకూడదు. విద్యా సంస్థలు, దవాఖానలకు సమీపంలో లౌడ్‌ స్పీకర్లను ఉపయోగించరాదు

పోలింగ్‌ రోజు నిబంధనలు ఇవే..
స్వేచ్ఛగా ఓటర్లు ఓటు హకు వినియోగించుకునే పరిస్థితులను కల్పించాలి. దీనికోసం పార్టీలు, నాయకులు, కార్యకర్తలు పూర్తిగా సహకరించాలి.
ఓటర్లకు స్లిప్‌లు ఇస్తే ఓటర్‌ ఐడీ, పోలింగ్‌ కేంద్రం వంటి వివరాలను తెల్ల కాగితంపై మాత్రమే రాసివ్వాలి. దానిపై పార్టీ గుర్తులు, రంగులు, అభ్యర్థి పేరు, పార్టీ పేరు ఏమీ ఉండకూడదు.
పోలింగ్‌ సమయానికి 48 గంటల ముందు నుంచి మద్యం పంపిణీ చేయడం పూర్తిగా నిషిద్ధం.
పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లు మినహా మరెవరూ ఉండకూడదు.
అభ్యర్థులు, ఏజెంట్లు ఏమైనా ఫిర్యాదులు చేయాలంటే ఎలక్షన్‌ కమిషన్‌ నియమించిన పరిశీలకులను సంప్రదించాలి.

ర్యాలీలకు ఈ రూల్స్‌ మస్ట్‌…
ఎవరైనా ర్యాలీలు చేయాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకొని, వారి సూచనల ప్రకారం నిర్వహించాలి.
నాయకులు, అభ్యర్థులను పోలిన దిష్టిబొమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లడం, ఆ దిష్టబొమ్మలను దహనం చేయడం నిషేధం.

ఇది కూడా చదవండి..

మోగిన ఎలక్షన్ నగారా..!