రోహిత్ రెడ్డికే బలమైన మద్దతు

తాండూరు రాజకీయం వికారాబాద్

రోహిత్ రెడ్డికే బలమైన మద్దతు
– గెలిపించుకుని సత్తా చూపిస్తాం
– ఆర్. కృష్ణయ్య ఆదేశాలతో సహకారం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే బీసీల బలమైన మద్దతు అందిస్తామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఓ హోటల్లో బీసీ సంఘం సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్, కుల గణన, జన గణన చేపట్టాలని కోరితే బీజేపీ, కాంగ్రెస్లను స్పందించడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బీసీల పట్ల సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు. ఇటీవలే రోహిత్ రెడ్డి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యను కలిసి మద్దతు కోసం విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ఆర్. కృష్ణయ్య ఆశయానికి అనుగుణంగా తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వ్యక్తిగతంగా కూడా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా తాండూరులో బీసీల డిమాండ్లను గుర్తించి రూ. 2 కోట్లతో 2 ఎకరాలలో బీసీ సమీకృత భవన నిర్మాణానికి తోడ్పాటు అందించారని గుర్తుచేశారు. బీసీల కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బలమైన తోడ్పాటు అందిస్తున్నాట్లుగా భావిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో బీసీల మద్దతు పైలెట్ రోహిత్ రెడ్డికి అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పైలెట్ రోహిత్ రెడ్డి తరుపున గడప గడపకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డిని గెలిపించి బీసీ సత్తా చాటుతామని అన్నారు. ఇందులో ఎలాంటి స్వార్ధ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, మండలాల అధ్యక్షులు రాధాకృష్ణ, లక్ష్మణ్చారి, నరేందర్, మహిళ నాయకులు జ్యోతి, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..