కిలాడీ.. లవర్..!
– మాజీ లవర్‌ను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్లాన్
– బెడిసి కొట్టిన ప్రియురాలి పన్నాగం
– పోలీసులకు అడ్డంగా దొరికిన యువతి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : లవర్ మీద కోపంతో పగ తీర్చుకోవాలనుకుని తానే కేసులో అడ్డంగా ఇరుక్కుంది ఓ యువతి. మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు యువతి పన్నిన పన్నాగం పోలీసుల విచారణలో పటాపంచలైంది. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిన యువతి జైలుపాలు అయ్యింది. సినిమా ట్విస్టులను తలపించిన ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో రమహత్ నగర్‌కు చెందిన రింకీ పనిచేస్తోంది. అదే ప్రాంతంలో సరూర్‌నగర్‌కు చెందిన పనిచేస్తున్నాడు. కొంతకాలంగా వీరీద్దరు ప్రేమించుకున్నారు.
శ్రవణ్ కొన్ని రోజులుగా రింకీని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న రింకీ.. ఎలాగైనా అతడిని జైలుకు పంపి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. తన స్నేహితులతో కలిసి గంజాయి కేసులో ఇరికించేందుకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా మంగళ్‌హాట్‌లో రూ.4 వేలకు 40 గ్రాముల గంజాయి కొనుగోలు చేసింది. 8 గ్రాముల చొప్పున ఐదు ప్యాకెట్లు తయారుచేసి తన వద్ద పెట్టుకుంది. అనుకున్న ప్లాన్ ప్రకార తన స్నేహితులతో శ్రవణ్‌కు ఫోన్ చేయించి.. అమీర్‌పేట సమీపంలోని ఓ పార్క్ వద్దకు రప్పించింది. ఆ తర్వాత రింకీ, ఆమె స్నేహితులు, శ్రవణ్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. అందరూ పబ్‌లో ఉన్న సమయంలో రింకీ.. తనకు తెలిసిన ఓ కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి.. శ్రవణ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నారు, ఫలానా నంబరు కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని చెప్పింది.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా గంజాయి పొట్లాలు లభ్యమయ్యాయి. వెంటనే శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. కారు నాది కాదు, వేరే వాళ్ల కారులో వచ్చానని చెప్పాడు. దీంతో కారులో వచ్చిన వారందరినీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఇందులో పోలీసులు రింకీని విచారించగా ఆ కారులో గంజాయి ఉన్న విషయం నీకు ఎలా తెలుసంటూ విచారించారు. క్రాస్ క్వశ్చనింగ్ చేయడంతో అమ్మాయి దొరికిపోయింది. దీంతో అమ్మాయిని, ఆమెకు సహకరించి స్నేహితుల ముఠాను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రింకీ. రింకీకి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి…

