కండక్టర్ కుటుంబానికి ఆర్టీసీ అండ

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

కండక్టర్ కుటుంబానికి ఆర్టీసీ అండ
– రూ. 40 లక్షల చెక్కుతో ఆదుకున్న సంస్థ
– ఎండీ వీసీ సజ్జనార్ చేతుల మీదుగా అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన తాండూరు ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి టీఎస్‌ ఆర్టీసీ సంస్థ అండగా నిలిచింది. రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన తాండూరు డిపో కండక్ట‌ర్ లక్ష్మణ్‌ కుటుంబానికి రూ.40 లక్షల విలువైన చెక్కును అందజేసింది. గురువారం హైదరాబాద్‌లోని బస్‌బవన్‌లో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేతుల మీదుగా తాండూరు బ్రాంచీ మేనేజర్ అరుణ్ కుమార్, రంగారెడ్డి డిప్యూటీ ఆర్ఎం రాజు, తాండూరు డీపో మేనేజర్ సమతారెడ్డి సమక్షంలో అందజేశారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు డిపోనకు చెందిన కండక్టర్‌ లక్ష్మణ్‌ గత యేడాది జూన్ 22న హైదరాబాద్ శివారు హకీంపేటలో జరిగిన జోనల్ స్టాఫ్‌ శిక్షణ కార్యక్రమానికి వెళ్లారు.

అక్కడ ఓ ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో లక్ష్మణ్‌ మరణించారు. ఈ ఆప‌ద స‌మ‌యంలో యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ సదుపాయం ద్వారా వచ్చిన ప్రమాద బీమా సౌకర్యం బాధిత కుటుంబాన్ని ఆదుకుంది. ప్ర‌మాదాలు జ‌రిగిన స‌మ‌యంలో సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేత‌నం ప్ర‌కారం) క‌నీసం రూ.40ల‌క్ష‌లు వరకు యూబీఐ అందజేస్తోంది. దీంతో కండక్టర్ లక్ష్మణ్‌ భార్యకు ఆర్టీసీ సంస్థ ద్వారా రూ.40 లక్షల ఆర్థిక సాయంను అందజేశారు. అనంతరం ఆదుకున్న ఆర్టీసీ సంస్థకు, యూబీఐకి కండ‌క్ట‌ర్ లక్ష్మణ్‌ భార్య జ్యోతి, కుమారుడు అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఈడీ ఎస్‌.కృష్ణకాంత్‌, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, సీపీఎం ఉషాదేవి, యూబీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!