వసూళ్లే టార్గెట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వసూళ్లే టార్గెట్..!
– మున్సిపల్‌లో సిబ్బంది చేతివాటం
– సర్కారు యాప్‌ దుర్వినియోగం
– ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి కొత్త డెత్‌ సర్టిఫికెట్
– ట్రేడ్‌ లైసెన్సుల్లో కూడా అదే పంథా
తాండూరు, దర్శిని డెస్క్ : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు మున్సిపల్‌లో డబ్బుల వసూళ్లే టార్గెట్‌గా పనిచేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమే అన్నట్లుగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బులు వసూలు చేసి ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి కొత్త డేట్‌తో డెత్ సర్టిఫికెట్‌ మంజూరు చేశారు. ఒక జవాన్‌ చేసిన పనికి, మరో జవాన్ చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే వివరాల్లోకి వెళ్లితే.. తెలంగాణ సర్కారు మున్సిపల్, గ్రామ పంచాయతీలలో జనణ, మరణ దృవీకరణ పత్రాల మంజూరు కోసం బరియల్ గ్రౌండ్ అనే యాప్ ను ప్రవేశ పెట్టింది.

అయితే తాండూరు మున్సిపల్ లో కింది స్థాయి సిబ్బంది ఈ యాప్ ను దుర్వినియోగం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని వాల్మీకీ నగర్ కు చెందిన కిష్టయ్య (78) అనే వ్యక్తి కరోనా కాలంలో మరణించాడు. కరోనా కంటే ముందు ఆయన అదృశ్యమైనట్లు పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు స్థానికంగా ప్రచారం ఉంది. కిష్టప్ప డెత్ సర్టిఫికెట్ కోసం అదే ప్రాంతంలో పనిచేస్తున్న ఓ జవాన్ ను వారు సంప్రదించారు.
దీనికి సదరు జవాన్ రూ.10వేలు డిమాండ్ చేశాడు. ఇస్తామని అంగీకరించడంతో బరియల్ గ్రౌండ్ యాప్ తన వద్ద లేకున్నా కూడా మరో జవాన్ వద్ద నుంచి ఫోన్, తీసుకుని అందులో కిష్టప్ప డెత్ సర్టిఫికెట్ వివరాలను నమోదు చేశాడు. విశేషం ఏమిటంటే కిష్టప్ప కరోనా కాలంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు పేర్కొనగా జవాన్ మాత్రం ఇటీవలే మరణించినట్లు నమోదు చేశాడు. అదికూడా ప్రభుత్వ సెలవు దినమైన రెండో శనివారం రోజు. దీంతో ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా యాప్ ద్వారా కిష్టప్ప పేరుపై డెత్ సర్టిఫికెట్ మంజూరు కావడం గమనార్హం.

ట్రేడ్‌ లైసెన్సుల్లో అదే ఫంథా
బరియల్ గ్రౌండ్ యాప్ వ్యవస్థలో వసూళ్ల మాదిరిగానే ట్రేడ్ లైసెన్స్ మంజూరులో కూడా కిందిస్థాయి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే మున్సిపల్ శాఖ ట్రేడ్ లైసెన్స్ ల జారీని ఆన్ లైన్ చేసింది. పట్టణంలోని కొందరు వ్యాపారులతో మచ్చిక ఉన్న సిబ్బంది తామే ట్రేడ్ లైసెన్స్ లు నమోదు చేయించి మంజూరయ్యేలా చూస్తామని వ్యాపారులను బుట్టలో వేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు ‘ వారిని సమ్మి ఆడినంత ఇచ్చేస్తున్నారు.

తీసుకున్న డబ్బులకు సక్రమంగా పనిచేయాల్సిన సిబ్బంది సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ అధికారుల ఆదేశాల ప్రకారం వివరాలు నమోదు చేసిన రెండు రోజుల్లోనే వ్యాపారులకు లైసెన్స్ లు జారీ చేయాలి. కాని వారాలు, నెలలు గడుస్తున్నా ఆటు ఎలాంటి లైసెన్సులు జారీ కాలేదని వ్యాపారులు వాపోతున్నారు. దీనిని బట్టే కింది స్థాయి సిబ్బంది వసూళ్లకు పాల్పడ్డారని అర్థం చేసుకోవచ్చు.

చర్యలు తీసుకుంటాం : కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
బరియల్ గ్రౌండ్, ట్రేడ్ లైసెన్సుల పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు తమ దృష్టికి రాలేదు. వచ్చిన ఆరోపణలపై కింది స్థాయి సిబ్బందిని విచారిస్తాం. ఆరోపణలు రుజువైతే సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. ఇంకో ముఖ్య విషయం ట్రేడ్ లైసెన్సుల విషయంలో వ్యాపారులు సిబ్బంది ఎవరైనా సరే నేరుగా డబ్బులు ఇవ్వొద్దు. ఆన్ లైన్ లోనే ట్రేడ్ లైసెన్సు దరఖాస్తు చేసుకోవాలి.

తమలపాకులు ఆరోగ్య ప్రధాయిని