ఫ్రెంచ్ ఫ్రైస్ తిననీయడం లేదని..!
– భర్తపై గృహహింస కేసు పెట్టిన భార్య
– షాక్‌కు గురైన న్యాయమూర్తి
– సోషల్ మీడియాలో వైరల్
దర్శిని డెస్క్ : దేశంలో గృహిణులు పోలీసు మెట్లు ఎక్కి గృహ హింస కేసులు పెట్టడం చూస్తుంటాం. ఇందులో బలమైన కారణాలు కొన్ని ఉంటే.. మరికొన్ని సిల్లీ కారణాలతో భర్తలపై గృహ హింస కేసులు పడుతున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. తనను భర్త వేధిస్తున్నారంటూ గృహ హింస చట్టం కింద ఒక మహిళ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసింది. భర్త తనను ఫ్రెంచ్ ఫ్రైస్ తిననీయడం లేదన్నది ఆ గృహిణి కేసు పెట్టింది. ఆమె వాదన సరికాదని, తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విషయం ఏమిటో తెలుసుకుని జస్టిస్ ఎం.నాగప్రసన్న ఆశ్చర్యపోయారు. అయితే భార్య కాన్పు అనంతరం పౌష్టికాహారం, పండ్లు, పాలు తదితరాల బదులుగా బంగాళ దుంపలతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్నందుకు తనపైనే భార్య కేసు పెట్టిందని ఆ వ్యక్తి మొరపెట్టుకున్నాడు. భార్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని తినొద్దని వారిస్తే ఎదురు కేసు పెట్టడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అన్ని చోట్లా అతనిపై నమోదైన కేసులపై స్టే విధిస్తున్నట్లు న్యాయమూర్తి శుక్రవారం ప్రకటించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇదికూడా చదవండి…

