ఘరానా కేటుగాళ్లు..!

క్రైం తాండూరు తెలంగాణ వికారాబాద్

ఘరానా కేటుగాళ్లు..!
– ఏసీబీ అధికారులమంటూ ఉద్యోగులపై గాలం
– కేసు నమోదు చేస్తామని ఓ ఎంపీడీఓకు బెదిరింపు
– ఫోన్‌ పే, జీపే ద్వారా రూ. 5లక్షలు స్వాహా
– తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు
– ట్రేస్ చేసి నిందితులను పట్టుకున్న పోలీసులు
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏసీబీ అధికారులం అంటూ ఉద్యోగులను టార్గెట్‌ చేసుకుని బెధిరించి డబ్బులు దోచుకుంటున్న ఘరానా కేటుగాళ్లను వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు కటకటాల్లోకి పంపారు. సోమవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో స్థానిక డీఎస్పీ బాలకృష్ణారెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.

కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్‌ గ్రామానికి చెందిన తరుణ్ గౌడ(19) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కురుకుంటలో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. ఇతనికి చిక్బల్లాపూర్‌లో ఆర్టీసీ మెకానిక్‌ పనిచేస్తున్న ముజాహిద్(24) స్నేహితులు. ఈ ఇద్దరితో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపూర్ జిల్లా కొట్టాలపల్లి గ్రామానికి చెందిన నూతేటి జయకృష్ణ అలియాస్ జయసింహాలు ముఠాగా ఏర్పడ్డాడు. ఏసీబీ అధికారులం అంటూ కొంత మంది ఉద్యోగులకు టార్గెట్‌ చేసుకుని ఫోన్లు చేయడం, కేసులు నమోదు చేస్తామని వారిని బెధిరించి దోపిడిలకు పాల్పడుతున్నారు.

వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణం ముత్యాల గల్లికి చెందిన బండి లక్ష్మప్ప సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఎంపీడీఓగా పనిచేస్తున్నారు. గత నెల 18న జయకృష్ణ, తరుణ్ గౌడ, ముజాహిద్‌లు లక్ష్మప్పకు ఏసీబీ అధికారులం అంటూ ఫోన్‌ చేశారు. మీపై ఫిర్యాదు అందింది.. కేసు నమోదు చేస్తున్నామంటూ బెదిరించారు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తాండూరు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు
కేటుగాళ్ల నుంచి వచ్చిన బెదిరింపులకు భయపడిన ఎంపీడీఓ లక్ష్మప్ప తన సంబంధికుల ద్వారా నిందితులకు ఫోన్‌ పే, జీపే ద్వారా రూ. 5లక్షలు పంపించాడు. తనకు మోసం జరిగిందని అనుమానంతో గతనెల 20న తాండూరు పట్టణానికి వచ్చిన ఎంపీడీఓ లక్ష్మప్ప స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఫోన్ నెంబర్లతో పాటు ఖాతా నెంబర్ల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు వారిపై నిఘా ఉంచారు.

ఈ క్రమంలో నిందితులు మహబూబ్ నగర్ వచ్చినట్లు సమాచారం అందింది. బస్టాండ్‌లో తరుణ్ గౌడ, ముజాహిద్‌లను అదుపులోకి తీసుకుని తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ ఫోన్‌లు, రూ. 1లక్ష  స్వాదీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా నేరాన్ని అంగీకరించారు. మరోవైపు కేసులో ప్రధాన నిందితుడు అయిన జయకృష్ణ పరారిలో ఉన్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. నిందితులపై ఆంద్రప్రదేష్‌, తెలంగాణ రాష్ట్రాలలో 3 కేసులు ఉండగా, ప్రధాన నిందితుడు జయకృష్ణపై మొత్తం 31 కేసులు ఉన్నాయని వెల్లడించారు.

సిబ్బందికి అభినందనలు
మరోవైపు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ ఎండీ అంజధ్, కానిస్టేబుల్స్ శివ, షబ్బిల్, సాయప్ప మరియు మహేష్ లను డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఎవరైనా ఏసీబీ అధికారులం అంటూ ఫోన్‌ చేస్తే నమ్మరాదన్నారు. బెదిరిపోయి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ కాశినాథ్‌లు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

పేకాట స్థావరంపై దాడులు