వికారాబాద్‌ జిల్లాకు వుడా

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

వికారాబాద్‌ జిల్లాకు వుడా
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
– కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్
– నామినేట్‌ పదవులతో మెంబర్ల భర్తికి అవకాశం
– పంచాయతీలు, మున్సిపల్టీలు వుడా పరిధిలోకి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వుడా(అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ) కమిటిలను జిల్లా కేంద్రాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లాకు కూడా వుడా కమిటిని ప్రకటించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 4 మునిసిపాలిటీలతో పాటు 585 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మునిసిపాలిటీలు, 585 గ్రామ పంచాయతీలు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ పరిధిలోకి వచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ కమిటికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మిగత మెంబర్లను నామినేట్‌ పదవులతో భర్తి చేసే అవకాశం ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

వుడాతో ప్రయోజనం
వికారాబాద్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (వుడా) ఏర్పాటైతే కేంద్ర పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులకు నిధులు విడుదల కానున్నాయి. పట్టణాల అభివృద్ధికి పట్టణాభివృద్ధి శాఖ నిధులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గ్రామీణాభివృద్ధి శాఖ నిధులను వినియోగించనున్నారు. మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ పర్యవేక్షణలో కొనసాగనుంది. అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ పట్టణాలతో పాటు గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించనుంది. మౌలిక వసతులకు పెద్ద పీట వేయనున్నారు. మునిసిపాలిటీలు, గ్రామాల పాలకవర్గాలకు అనుసంధానంగా ఈ అథారిటీ పనిచేయనుంది. లే అవుట్ల అభివృద్ధితో పాటు గ్రామాలు, పట్టణాల్లో రహదారులు, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌, పార్కులు, ఓపెన్‌ జిమ్‌లు, కల్వర్టులు, డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణానికి నేరుగా నిధులు వెచ్చించే అవకాశం ఉంటుంది. భవన నిర్మాణాలు, లేఔట్లు, పరిశ్రమల ఏర్పాటుకు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీయే అనుమతులు జారీ చేయనుంది.

ఇదికూడా చదవండి…

మల్లారెడ్డా.. మజాకా..!