ఎమ్మెల్యేతో విభేదాలు లేవు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యేతో విభేదాలు లేవు..!
– ఇంటి కార్యక్రమం వల్లే ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయా
– అనవసరంగా రాజకీయ చిచ్చు పెట్టొద్దు
– మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– చైర్‌పర్సన్‌ గైర్హాజరు వివాదంను ఖండించిన ఏఎంసీ మాజీ చైర్మన్‌ పట్లోళ్ల బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇంట్లో నవరాత్రుల సందర్భంగా దీపం పెట్టే కార్యక్రమం ఉండటంతోనే పోట్లి మహరాజ్‌ దేవాలయ ప్రాంగణంలో జరిగిన నూతన నిర్మాణాల ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయానని తెలిపారు. తన గైర్హాజరును రాజకీయ విభేదాలకు ముడిపెట్టి ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు.

తాండూరు పట్టణంలోని సద్గురు పోట్లి మహరాజ్‌ దేవాలయ ప్రాంగణంలో గురువారం జరిగిన నూతన వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి గైర్హాజరు కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆమె తన గైర్హాజరుకు కారణాన్ని వెల్లడిస్తూ, ఎమ్మెల్యేతో విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

వ్యక్తిగత, కుటుంబ కార్యక్రమాల కారణంగా హాజరుకాలేకపోవడాన్ని రాజకీయాలకు ఆపాదించవద్దని ఆమె కోరారు. అనవసరంగా రాజకీయ చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు.

చైర్‌పర్సన్‌ గైర్హాజరుపై జరుగుతున్న ప్రచారాన్ని ఏఎంసీ మాజీ చైర్మన్‌ పట్లోళ్ల బాల్‌రెడ్డి సైతం ఖండించారు. ఇంట్లో నవరాత్రుల సందర్భంగా దీపం పెట్టే కార్యక్రమం ఉండటంతోనే ఆమె ప్రారంభోత్సవానికి వెళ్లలేకపోయారని తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయ విభేదాలుగా చిత్రీకరించడం సరికాదని అన్నారు.

Pvr

మిసైల్‌ మ్యాన్‌కు ఇదేనా గౌరవం..?