వయా తాండూరు టు బీదర్..!
– తాండూరు మీదుగా మరో జాతీయ రోడ్డు
– నిర్మాణానికి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
– అందుబాటులోకి వస్తే కలిగే ప్రయోజనం ఇదే
– చొరవ చూపిన స్పీకర్, తాండూరు ఎమ్మెల్యే
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు మీదుగా మరో రోడ్డుకు జాతీయ రహదారి రాబోతుంది. తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాలకు అనుసంధానంగా ఈ రహదారికి ప్రభుత్వం జాతీయ హోదా కల్పించబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలపై ప్రభుత్వం కసరత్తును ప్రారంభిచింది. సమగ్ర వివరాల నివేధికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇప్పటికే తాండూరు మీదుగా ముంబయ్ నేషనల్ హైవే 167ను మంజూరు చేసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రోడ్లను జాతీయ రోడ్లుగా మార్పుచేసి అభివృద్ధి పరిచేందుకు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రహదారులను ఉన్నతీకరించే ప్రక్రియలో భాగంగా తాండూరు మీదుగా 134కిలోమీటర్ల దూరం వరకు రోడ్డును అభివృద్ధి పరిచేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వ్యాపార వాణిజ్య కేంద్రం, కర్ణాటక రాష్ర్టానికి అనుసంధానంగా ఉన్న తాండూరు మీదుగా బీదర్ రోడ్డును జాతీయ రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ మార్గంలో 60 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారిని ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ రహదారికి గతంలో 2023లో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అప్పట్లో దాదాపు రూ.300 కోట్లు అంచనా అవుతుందని ప్రతిపాదన సిద్ధం చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి నివేదించలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవచూపి ఈ రహదారిని మెరుగుపర్చాలని నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్‌తో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మన్నెగూడ వయా తాండూరు మీదుగా బీదర్ వరకు జాతీయ రహదారిగా హోదాను కల్పించేందుకు అధికారులు తగిన చర్యలు వేగవంతం చేశారు.
కలిగే ప్రయోజనం ఇదే…
సింగిల్ రోడ్డుగా ఉన్న తాండూరు-జహీరాబాద్, తాండూరు-వికారాబాద్ ఉన్నందున వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం జరిగితే తెలంగాణలోని పలు పట్టణాలకు, కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ పట్టణాలకు రాకపోకలు సజావుగా సాగుతాయి. రెండు రాష్ర్టాల మధ్య జాతీయ హోదా కల్పిస్తే ఈ రోడ్డులో రవాణా వ్యవస్థ మరింత మెరుగు పడుతుంది. దూరభారం కూడ తగ్గుతుంది.
ఇదికూడా చదవండి…

