చెరుకు రసంతో బోలెడు లాభాలు..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

చెరుకు రసంతో బోలెడు లాభాలు..!
– మూత్రపిండాల్లో రాళ్ల సమస్యకు ఔషదాలు
– సంతోనోత్పపత్తి అవకాశాలు మెరుగు
– చెరుకు రసం ఎవరు తీసుకోవద్దంటే..?
దర్శిని డెస్క్ : ఎండాకాలం కాస్త పెరగ్గానే చల్లని పానీయాల మీదకు మనసు పోతూ ఉంటుంది. వేసవి ఎండల్లో మంచినీళ్లు ఎన్ని తాగినా దాహం తీరినట్లు అనిపించదు. అలాంటప్పుడు చక్కెర అధికంగా కలిపిన శీతల పానీయాలనో, పండ్ల రసాలనో ఆశ్రయించే బదులు నిమ్మ, అల్లంతో చేసిన సహజసిద్ధమైన చెరుకు రసం ఒకటి లేదా రెండు గ్లాసులు తాగి చూడండి. కేవలం దాహం తీరడమే కాదు, చెరుకురసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఈ చెరకు రసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది బరువును అదుపులో ఉంచుతుంది. చెరకులో కాల్షియం ఉండటంతో అది ఎముకలు దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్నపిల్లల ఎదుగుదలకు చెరకురసం చక్కగా దోహదపడుతుంది. శరీరంలో అధిక బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను ఈ రసం తగ్గించగలదు.

బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి ప్రతి రోజూ రెండు పూటలా తీసుకోవటం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చెరకు రసం పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది.

మూత్రపిండాలలో ఉన్న రాళ్ల సమస్యల్ని తొలగించడంలో చెరుకురసం ఎంతగానో దోహదపడుతుంది. చెరుకులో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వలన జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. చెరుకు రసం తాగడం వలన వీర్యకణాల నాణ్యత పెరగడంతోపాటు సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయని కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది. బాలింతలు చెరుకు రసం తాగడం వలన వాళ్లలో పాల ఉత్పత్తి అధికం అవుతుంది. చెరుకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, మేలైన నిగారింపుతో మెరిసిపోతుంది. అలానే ముఖంపై ఏర్పడే మొటిమలు కూడా తగ్గిపోతాయి.

ఈ సమస్యలు ఉన్నవారు తీసుకోవద్దు..
చెరుకు రసాన్ని రోజూ క్రమం తప్పకుండా గానీ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవట. మామూలుగా చెరుకు రసాన్ని స్త్రీలైతే రోజుకు ముప్పావు కప్పు, అదే పురుషులు ఒక కప్పు మాత్రమే తాగాలి. బరువు సమస్య ఉన్నవారు తాగితే ఇంకా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు కూడా దీనిని తీసుకోకపోవడమే మంచిది. వీళ్ళు గానీ తీసుకుంటే జీర్ణ క్రియ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్న వయసు పిల్లలు, విటమిన్ సప్లిమెట్లను తీసుకునేవారు, రక్తాన్ని పలుచగా చేసేందుకు మందులు వాడుతున్నవారు కూడా ఈ చెరుకు రసాన్ని అతిగా తీసుకోకూడదు. జీర్ణ శక్తి తక్కువగా జరిగే వారు ముఖ్యంగా తరచుగా కడుపు నొప్పి, విరేచనాలతో ఇబ్బంది పడేవారు చెరుకు రసాన్ని తీసుకోకపోవడం బెటర్.

ఇదికూడా చదవండి…

హ్యాకింగ్‌కు డేంజర్ బెల్‌.. గ్రీన్ సిగ్నల్..!