సర్పంచ్‌కు ఓ.. లెక్క..!
– జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మరో లెక్క
– మైక్ పెట్టినా, పాంప్లెట్ పంచినా ఆ లెక్కలోకే
– స్థానిక అభ్యర్థుల ఖర్చుల వివరాలు ఇవే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఆశావాలందూరు పోటీకి సై అంటున్నారు. కాని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులకు ఓ లెక్క ఉంటుందని.. దాని పరిమితి దాటితే పరిణామాలు వేరే ఉంటాయని హెచ్చరిస్తోంది.

ఎన్నికల సంఘం సర్పంచుల అభ్యర్థులు ఖర్చు చేసే నిధులను, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల కోసం చేసే ఖర్చుల వివరాలను డిసైడ్ చేసింది. ఏ విధంగా ఖర్చుల లెక్కలు నిర్దారించారో బరిలో నిలిచే అభ్యర్థులు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలు, ఎంపీ టీసీ అభ్యర్థులు రూ.1.50 లక్షలు, సర్పంచ్ అభ్యర్థు లు గ్రామపంచాయతీ జనాభా ఆధారంగా రూ.1.50 లక్షలు లేదా రూ.2.50లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.

2011 జనాభా లెక్కల ప్రకారం 5వేల జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.50వేలు, 5 వేల జనాభా కంటే తక్కువ ఉన్న పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.30,000 వరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతంలో రాజకీయ పార్టీలు చేసే ప్రచార ఖర్చులు కూడా ఆయా అభ్యర్థుల ఎన్నికల ఖాతాలోనే జమవుతాయనే విషయాన్ని గుర్తించుకోవాలి. దీంతో పాటు ప్రచారంలో వాహనాలు, మైక్ సెట్లు, పోస్టర్లు, బ్యానర్లు, కరప త్రాల వంటి ఖర్చులు సైతం లెక్కల్లో చూపించక తప్పదు. పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి ఎన్నికల అనంతరం 45 రోజుల్లోపు తమ తుది ఖర్చు నివేదికలు అందించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ లెక్కలు పక్కాగా లేకపోయినా.. పరిమితులు దాటినా తీవ్ర పరిణాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి పోటీ చేసే అభ్యర్థులు పారా హుషార్.

ఇదికూడా చదవండి…

