ఫ్రీగా రేషన్ బ్యాగులు..!

తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఫ్రీగా రేషన్ బ్యాగులు..!
– పంపిణీ చేసేందుకు నిర్ణయం
– ఈ బ్యాగుల పంపిణీలో సర్కారు ప్లాన్ ఇదే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇక రేషన్ దుకాణంలో బియ్యం తెచ్చుకునేందుకు బ్యాగులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఈ బ్యాగులు అందించడం వల్ల పేదలతో పాటు ప్రభుత్వానికి మంచి ప్రయోజనం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ప్రజా ప్రభుత్వం పేద ప్రజల ఆహార భద్రతను నిర్ధారించడంతో పాటు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా అడుగులు వేస్తోంది.
kvcs

పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వచ్చే నెల నుంచి ఈ బ్యాగులను రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఇస్తారు. ఈ బ్యాగులు కేవలం రేషన్ సరుకుల కోసం మాత్రమే కాకుండా, ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజలకు తెలియజేసే ప్రచార సాధనంగా కూడా పనిచేస్తాయి. ఈ గ్యారంటీలలో ఉచిత విద్యుత్, రాయితీ గ్యాస్ సిలిండర్లు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు ఉన్నాయి.

ప్రయోజనం ఇలా..
సెప్టెంబర్ నుంచి రేషన్ పొందే వారికి.. సన్నబియ్యంతోపాటూ.. ప్రత్యేకమైన క్వాలిటీ సంచులను ఉచితంగా ఇవ్వబోతోంది. ఈ బ్యాగ్ బయట కొనాలంటే రూ.50 దాకా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫొటోలు బ్యాగులపై ఉంటాయి. ఈ బ్యాగులపై “ఇందిరమ్మ అభయ హస్తం” పేరుతో ఆరు గ్యారంటీల వివరాల్ని ముద్రించారు. ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే పర్యావరణహిత బ్యాగులను అందజేయబోతోంది. వచ్చే నెలలో అందజేసే ఈ సంచులను ప్రతి నెలా బియ్యం కోసం వెళ్లేటప్పుడు తీసుకెళ్తే సరిపోతుంది.

ప్రభుత్వ లక్ష్యం ఇదే..
ఈ బ్యాగులపై ముద్రించిన “తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రగతి పథం… సకలజన హితం… మన ప్రజా ప్రభుత్వం” అనే నినాదం ప్రభుత్వ సమగ్ర లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ బ్యాగులు స్మార్ట్ కార్డులతో కూడిన రేషన్ కార్డులతో పాటు పంపిణీ అవుతాయి. ఈ కార్డులు QR కోడ్‌లతో సురక్షితంగా రూపొందించినవి. ఈ స్మార్ట్ కార్డులు లబ్ధిదారుల గుర్తింపు వివరాలను సురక్షితంగా స్టోర్ చేస్తాయి, దుర్వినియోగాన్ని నిరోధిస్తాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మూడు నెలల రేషన్‌ను ముందస్తుగా పంపిణీ చేసిన ప్రభుత్వం, ఈ బ్యాగుల ద్వారా సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతం చేయబోతోంది.

ఇదికూడా చదవండి…

సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి..!