అంతారంలో ‘పంచాయతీ వివాదం’..!
– సర్పంచు ఎన్నికల ఫలితాలలో మోసం
– ఎన్నికల అధికారిపైనే అధిక అనుమానం
– సర్పంచు, ఉప సర్పంచు పదవులు రాకుండా ప్లాన్
– ఫలితాల రికార్డులు సీజ్ చేసి.. రీకౌంటింగ్‌కు డిమాండ్
– బోగస్ ఓట్ల వినియోగం వెనుక సీనీయర్ నేత
– జిల్లా కలెక్టర్‌కు బీఆర్ఎస్ పార్టీ నేత, గ్రామస్తుల ఫిర్యాదు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం గ్రామపంచాయతీలో జరిగిన సర్పంచులు ఎన్నికలు రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఎన్నికల అధికారి అక్రమాలకు పాల్పడడంతో బీఆర్ఎస్ పార్టీ మద్దతు సర్పంచు అభ్యర్థికి మోసం జరిగిందని, గెలుపు అంచు వరకు వచ్చిన సమయంలో ఎన్నికల అధికారి గెలుపు మలుపు తిరిగేలా కుట్రలు చేశారని ఆరోపించడంతో వివాదం ముదురుతోంది.

ఎన్నికల్లో బోగస్ ఓట్లను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునేలా ఓ సీనియర్ నేత మాస్టర్ మైండ్‌గా మారాడంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గ్రామానికి చెందిన బుడిగ జంగం శ్రీనివాస్ కోడలు బీజే రాజేశ్వరి సర్పంచు అభ్యర్థిగా, పార్టీకి చెందిన పలువురు వార్డు సభ్యులతో పోటీ చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఈనెల 11న పోలింగ్, అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ జరిగాయి. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా డి.రవీకుమార్ వ్యవహరించారు.
ఈనెల 11న పంచాయతీ ఎన్నికల్లో 7 మంది బీఆర్ఎస్ బలపరిచిన సభ్యులు గెలవగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 5 మంది గెలిచారు. ఎన్నికల లెక్కింపు చివరి దశకు వచ్చిన సమయంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచు అభ్యర్థి గెలుపు ఖాయం అంటూ చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి 6 ఓట్ల తేడాతో విజయం సాధించారని ఎన్నికల అధికారి డి. రవికుమార్ చెప్పారని ప్రకటించారు. చివరి నిమిషంలో కేవలం 6 ఓట్ల తేడాతో బీజే రాజేశ్వరి ఓటమి వెనుకకాల పలు అనుమానాలు ఉన్నాయని శ్రీనివాస్ సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఎన్నికల అధికారిపై అనుమానాలు
ఎన్నికల విషయంలో ఎన్నికల అధికారి రవికుమార్‌పై అనుమానాలను వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచిన 7 మంది వార్డు సభ్యులకు అదే రోజు దృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఎన్నికల అధికారి ఎన్నికల నిబంధనలను పాటించలేదని తెలిపారు. ఎన్నికల అధికారి ప్రవర్తన, వ్యవహారం పక్షపాతంగా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. కౌంటింగ్ విషయంలో సర్పంచ్ అభ్యర్థి గెలవకుండా చేయడండంతో పాటు గెలిచిన వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆలస్యం చేశారని తెలిపారు. అధికార పార్టీ నేతల వద్ద డబ్బులు తీసుకుని ఓట్ల లెక్కల్లో మార్పులు చేశారని ఆరోపించారు. సబ్ కలెక్టర్ కు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తేనే ఎన్నికల అధికారి ఉప సర్పంచు ఎన్నిక నిర్వహించారని తెలిపారు.

రికార్డులు సీజ్ చేసి.. రీకౌంటింగ్ చేయాలి
సర్పంచు ఎన్నికకు సంబంధించి రికార్డులు అన్నింటిని సీజ్ చేసి రీకౌంటింగ్ చేయాలని కోరారు. బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి విజయం వైపు దూసుకపోతుండగా ఎన్నికల అధికారి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం ఆరు ఓట్ల తేడాలో విజయం సాధించిందని ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి తీరుపై విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి వరకు సర్పంచు ప్రమాణ స్వీకారంను కూడా ఆపాలని కోరారు.
బోగస్ ఓట్ల వినియోగం వెనుక సీనీయర్ నేత
అంతారం పంచాయతీ ఎన్నికల్లో బోగస్ ఓట్ల వినియోగానికి తెరలేపారని ఆరోపించారు. గ్రామంలోని 8వ వార్డులో ఉన్న 31 మందికి గ్రామంతో పాటు తాండూరు పట్టణంలోని 22వ వార్డులో కూడా ఓట్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ ఓట్లను తొలగించాలని వీటిపై 2019లో పూర్తి వివరాలను తాండూరు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. బోగస్ ఓట్ల వినియోగంలో ఓ సీనీయర్ నేత మాస్టర్ మైండ్ గేమ్ ఆడారని ఆరోపించారు. తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుని.. న్యాయం జరిగేలా చూడాలని బీజే శ్రీనివాస్, గ్రామానికి చెందిన మాజీ సర్పంచు రాములు. మాజీ ఉపసర్పంచు జీవరత్నం, యువకులు కోరారు.

ఇదికూడా చదవండి…

