పుర సమరం.. రసవత్తరమే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పుర సమరం.. రసవత్తరమే..!
– కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మద్యే కుర్చీలాట
– పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు
– మాజీ కౌన్సిలర్లపై సై అంటున్న యూత్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్‌కు జరిగే పోరు ఈ సారి మరింత రసవత్తరంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మద్య కుర్చీలాట జరగక తప్పదని అనిపిస్తోంది. తాండూరు చైర్ పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆయా పార్టీల ప్రధాన నాయకులు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు. ఏయే వార్డులకు ఏయేడా రిజర్వేషన్లు వస్తున్నాయి.. ఏయే వార్డులకు పోటీకి సిద్దం కావాలనే కన్నేసి ఉంచారు. ఈ వార్డు కాకపోతే.. మరో వార్డు నుంచి పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్నారు. ఏ వార్డు ఎలా ఉన్నా తాండూరులో చైర్ పర్సన్ స్థానం కోసం సాయిపూర్ నేతల మద్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే అవకాశం దక్కితే తాము కూడా రేసులో ఉంటామని కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలలో నేతలు సిద్దమవతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఓ కింగ్‌ మేకర్‌ అంటూ కొందరు ఇచ్చిన బిరుదు అందుకున్న నాయకుడు పోటీకి సై అంటూ ఇన్‌డైరెక్ట్ సిగ్నల్‌ ఇస్తున్నారు. ఇక బీఆర్ఎస్‌ పార్టీలో సీనీయర్ నేత చైర్‌ పర్సన్ స్థానానికి పోటీకి సిద్దపడుతుండగా.. అదే పార్టీలోని ఓ నాయకుడు సీనీయర్ నేతకు అడ్డం పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారికి సయోధ్య కుదరకుంటే ఓ మాజీ చైర్ పర్సన్ ఇంటి నుంచి ఒకరిని బరిలో నిలపాలని యోచిస్తున్నారు. ఈ పరిణామాల మద్యలో మరో సీనీయర్ నేత తన సన్నిహితులకు చైర్ పర్సన్ పదవి కట్టబెట్టేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇలాంటి పరిణామాలతో పుర సమరం ఎన్నికలు రాకమందే వేడిని పుట్టిస్తున్నాయి.

మాజీలపై సై అంటున్న యూత్
మరోవైపు తాండూరు మున్సిపల్ పరిధిలో కౌన్సిలర్ల స్థానాలకు పోటీ చేసేందుకు యూత్ సై అంటున్నారు. మాజీ కౌన్సిలర్లపై పోటీకి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ కౌన్సిలర్లకు ఈ సారి కౌన్సిలర్‌గా పోటే చేసే అవకాశాలు కనిపించకపోవడంతో కొత్తగా యువకులు బరిలో నిలవాలని ఆసక్తిని చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓ యువ వ్యాపారి తనకు అనుకూలంగా ఉన్న వార్డులో పోటీ చేసి.. ఎన్నికల్లో గెలిస్తే వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని ఆశపడుతున్నారు. హస్తం పార్టీలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అనుచరగణం నుంచి యువకులు పోటీ చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో యువకుల మద్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి బలం ఉన్న వార్డులలో ఒకరు కాకుండా.. ఇద్దరు ముగ్గురు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు నియోజకవర్గంకు రూ. 10 కోట్లు..!