రాజకీయాలు తరువాత.. అభివృద్ధితో ముందుకు..!
– పచ్చదనం పెంచి… కాలుష్యాన్ని తగ్గించండి
– తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
– తాండూరులో రూ. 26కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజా ప్రతినిధులు రాజకీయాలు పక్కన పెట్టి.. అభివృద్ధిలో ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిలతో కలిసి రూ. 26కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి సబితారెడ్డి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.
మున్సిపల్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అనందరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ తాండూరులో అభివృద్ధిలో ఒక అడుగు ముందుకేస్తే.. నాలుగు అడుగులు వెనక్కిలాగే రాజకీయాలు గత కొన్నేళ్లుగా జరుగుతున్నాయన్నారు. అలాంటి రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేసి.. అభివృద్ధి కోసం ముందుకు సాగాలన్నారు. పలు సందర్భాలలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తారని గుర్తుచేశారు. అదేవిధంగా
తాండూరులో విపరీతంగా పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రజా ప్రతినిధులు దృష్టిసారించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతిలో పచ్చదానాన్ని పెంపొందించేందుకు గ్రీన్ బడ్జెట్ కింద నిధులు మంజూరు చేస్తుందన్నారు. పట్టణంలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించి కాలుష్యాన్ని దూరం చేయాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అధికారులు, ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని పెంపొందిస్తుందని, ఇందులో భాగంగా ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు, సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తోందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల వద్దకు వచ్చే ప్రజల సౌలభ్యం కల్పిస్తుందని అన్నారు.
కార్యాలయంలో పూజలపై రాద్దాంతం వద్దు
మరోవైపు తాండూరు మున్సిపల్ నూతన కార్యాలయంలో చైర్ ఫర్సన్ స్వప్న పరిమళ్ చేసిన పూజలు, ప్రారంభోత్సవ రాద్దాంతాన్ని మంత్రి సబితారెడ్డి సున్నితంగా చల్లార్చారు. కొత్త మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులంతా కలిసి ఉండాలనే ఉద్దేశంలో పూజలకు అవకాశం ఇవ్వడంజరిగిందని మంత్రి చెప్పుకొచ్చారు. పూజలతో అంతా ఏకమై తాండూరు అభివృద్ధిపై కొత్తగా పాలన చేయాలని అభిలాషించారు.
165 మంది లబ్ధిదారులకు చెక్కులు
తాండూరు పట్టణంలో జరిగిన మంత్రి పర్యటనలో భాగంగా మల్‌రెడ్డిపల్లిలోని హనుమాన్ ఫంక్షన్ హాల్‌లో కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా 165 మంది లబ్దిదారులకు రూ. 1కోటి 65 లక్షల 19వేల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలు, ఆడ పిల్లల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్, అసరా, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రూ. 50 లక్షలతో నిర్మించనున్న 5అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డుమార్గంలోని రూ. 2కోట్ల 25 లక్షలతో నిర్మించిన డిగ్రీ కళాశాల నూతన భవనంతో పాటు రూ. 20 కోట్లలతో నిర్మించిన మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. తాండూరు పట్టణం సాయిపూర్‌లో రూ. 20 లక్షల రూపాయలతో అంగన్ వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. మల్‌రెడ్డిపల్లి హనుమాన్ ఫంక్షన్ హాల్ లో 165 మంది లబ్ధిదారులకు, రూ.1 కోటి 65 లక్షల 19 వేల రూపాయల కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తాండూరు
పట్టణంలో 3 కోట్ల 47 లక్షలతో నిర్మించిన నూతన మున్సిపల్ భవనాన్ని ప్రారంభించారు. పట్టణ ప్రగతి ద్వారా మున్సిపల్‌కు మంజూరైన 18 చెత్త ఆటోలతో పాటు ఒక వైకుంఠ పరమపద వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు విశ్వనాథ్ గౌడ్, లక్ష్మారెడ్డి, కోట్రిక విజయలక్ష్మీ, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, డాక్టర్ సంపత్ కుమార్, విజయరంగారావు, కరణం పరుషోత్తంరావు, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.