ఓటింగ్‌కు వేళాయే..!
– పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు
– 585 మందితో మున్సిపల్ పోలింగ్
– ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్
– ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని 36 వార్డులకు గాను 117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మంగళవారం తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సులను తరలించారు. ఎన్నికల నిర్వహణ కోసం 585 మంది అధికారులను నియమించారు. 117 పోలింగ్ కేంద్రాలకు గాను 117 మంది పీఓలు, 117 మంది ఏపీఓలతో పాటు ముగ్గురు చొప్పున అధికారులను నియమించారు. వీరితో పాటు 20 శాతం మంది అధికారులను రిజర్వులో ఉంచుకున్నారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను 9జోన్‌లుగా విభజించారు. 16 మంది అబ్జర్వర్లను నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.

పట్టణంలోని 36 వార్డుల్లో 77వేల 29 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 39వేల 525 మంది మహిళలు, 37వేల 499మంది పురుషులు, 5 మంది ఇతరులు ఓటు హక్కును వినియోగనున్నారు. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లను తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ఉదయం నుంచి డీఆర్వో మంగీలాల్ డీఆర్సీ కేంద్రం వద్దే ఉండి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తాండూరు తహసీల్తార్ తారాసింగ్, మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి, అధికారులు సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

