అల్లం, పసుపులో అద్బుతాలు..!
– రెండు కలిపి తీసుకుంటే ప్రయోజనాలు
– కీళ్లు, గుండె జబ్బులు అన్ని పరార్
దర్శిని డెస్క్ : నేటి ఆదునిక యుగంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఇంట్లో ఉన్న కొన్ని చిట్కాలతో ఆరోగ్యాలను సంరక్షించుకోవచ్చు. అందరి ఇళ్లలో అల్లం, పసువులు ఆరోగ్య నిధులుగా పనిచేస్తాయి.

విడివిడిగానే ఎన్నో ప్రయోజనాలను ఇచ్చే ఇవి రెండూ కలిస్తే.. ఆ శక్తి రెట్టింపు అవుతుంది. ఒకటి చర్మానికి బంగారు ఛాయను ఇస్తే, మరొకటి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ రెండింటి కలయికతో చేసే ఒక చిన్న ‘షాట్’ మీ రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తుంది.
పసుపులోని ‘కర్కుమిన్’, అల్లంలోని ‘జింజెరాల్’ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కొంటాయి. కీళ్ల నొప్పులు, కండరాల వాపుతో బాధపడేవారికి ఈ పానీయం ఒక గొప్ప వరం. ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అల్లం కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తే.. పసుపు కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.

రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. పసుపు చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. అల్లం వల్ల మొటిమలు, నల్ల మచ్చలు తగ్గి చర్మం తాజాగా మారుతుంది.ఈ పసుపు-అల్లం షాట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొందరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిత్తాశయ సమస్యలు ఉన్నవారు, రక్తం పలుచబడే మందులు వాడేవారు దీనికి దూరంగా ఉండాలి. గర్భిణులు, బాలింతలు వైద్యుల సలహా తీసుకున్నాకే దీనిని ప్రారంభించాలి. ప్రకృతి ఇచ్చిన ఈ చిన్నపాటి చిట్కాలే మనల్ని పెద్ద రోగాల నుండి కాపాడతాయి.

ఎలా తయారు చేసుకోవాలంటే..?
ఒక గ్లాసులో సగం వరకు నీళ్లు తీసుకుని, అందులో ఒక టీస్పూన్ పసుపు, ఒక అంగుళం మేర దంచిన తాజా అల్లం ముక్క వేయాలి. దీనికి అరచెక్క నిమ్మరసం, చిటికెడు నల్ల మిరియాల పొడి జోడించాలి. రుచి కోసం ఒక టీస్పూన్ తేనె కలుపుకోవచ్చు. అన్నింటినీ బాగా కలిపి, వడపోసుకుని వెంటనే తాగేయాలి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ షాట్ తీసుకుంటే ఫలితాలు చాలా వేగంగా కనిపిస్తాయి.


