జోరుగా ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక..!
– కొనసాగుతున్న పట్టణ పరిశుభ్రత పనులు
– తాండూరు పట్టణ సుందరీకరణకు కృషి
– బల్దియా చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం తాండూరు పట్టణంలో జోరుగా కొనసాగుతోంది.

మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం కదులుతోంది. మంగళవారం తాండూరు పట్టణంలోని శాంతినగర్, విలియమూన్ స్కూల్ పరిసర ప్రాంతాలలో కార్యక్రమం కొనసాగింది. చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డిలు పర్యటించారు. ఆయా ప్రాంతాలలో మున్సిపల్ కార్మికుల చేత పారిశుద్ధ్య పనులు చేయించారు. రోడ్లపై చెత్త చెదారాన్ని తీయించారు. మురుగుకాలువలు శుభ్రం చేయించారు.

అనంతరం పట్టణంలోని శాంతినగర్ పార్కును సందర్శించి పార్కులో పచ్చదనం పెంపుకోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్కారు ఆదేశాలలో పట్టణంలోని ప్రతి వార్డులో పరిసర ప్రాంతాల పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పట్టణంలోని ప్రతి వార్డులో కార్యక్రమాలు చేపట్టి పట్టణాన్ని సుందరీకరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు. ఇళ్లు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్లపై, బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, కౌన్సిలర్‌లు అనిల్, ఈర్షాద్, నాగారం మల్లేశం, మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇనుస్పెక్టర్లు ఉమేష్, వెంకటయ్య, ఎన్వీరాల్ మెంట్ ఈఈ ప్రవీణ్ గౌడ్, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.


