బీఆర్ఎస్ పార్టీని వీడింది స్వార్ధపరులే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ పార్టీని వీడింది స్వార్ధపరులే..!
– 100 రోజుల్లో కాంగ్రెస్ చేసేందేమి లేదు
– హస్తంలో ఎంపీ రంజిత్ రెడ్డి చేరిక సిగ్గుచేటు
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలి
– చేవేళ్ల పార్లమెంట్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం
– పైలెట్ రోహిత్ రెడ్డిపై పిచ్చి కూతలు మానుకోండి
– 27న పార్టీ తాండూరు కార్యకర్తల సమావేశం
– మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదవుల కోసం, డబ్బుల కోసం పాకులాడే స్వార్థ పరులే బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్లిపోయారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారికి గుణపాఠం తప్పదని తాండూరు బీఆర్ఎస్ నేతలు ద్వజమెత్తారు. బుధవారం తాండూరు పట్టణం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో మీడీయా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు శ్రీనివాస్ చారి, ఎంపీటీసీ ఫోరం జిల్లా ఆధ్యక్షులు సాయిరెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు హన్మంతు తదితరులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి పదవులు పొందిన నేతలు స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.

మొన్న జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, నిన్న ఎంపీ రంజిత్ రెడ్డిలు పదువులు, స్వార్థం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. చేవేళ్ల ప్రజలకు ఎవరో తెలియని రంజిత్ రెడ్డిని ప్రజలు గెలిపిస్తే పార్లమెంట్ కు, జిల్లాకు చేసిందేమి లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో, కేసీఆర్ అనారోగ్యంగా ఉన్న సమయంలో మోస పూరితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ చేరడం సిగ్గుచేటన్నారు. ఐదేండ్లు కోడిగుడ్లు పంచి పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి పొందిన మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో చట్టా పట్టాలు వేసుకుని తిరగడం సమంజసం కాదన్నారు. ఆయన పదవి రాజీనామా చేసి కాంగ్రెస్ చేరాలని అన్నారు. డబ్బుల కోసం, పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల స్థానం నుంచి బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ కు అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. చేవేళ్ల పార్లమెంట్ లోని బీసీలు అందరు ఏకమై కాసానిని గెలిపించుకుంటామని, చేవేళ్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ రాముని పేరుతో మత రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. గతంలో చేవేళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అవకాశం ఇస్తే దుప్పట్లు పంచి కాలం దులుపుకున్నారని విమర్శించారు. ఇప్పుడు బీజేపీ నుంచి రాముని ప్రచారంతో గెలవాలని చూస్తున్నారని అన్నారు.

గ్యారెంటీలతో మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిందన్నారు. మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిందేమి లేదన్నారు. 6 గ్యారేంటీలలో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదన్నారు. రైతు రుణమాణి, రైతుబంధు, దళిత బంధు. మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసుగు చెందుతున్నారని అన్నారు. పక్కన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కోడంగల్ కు రూ. 5వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. తాండూరు నియోజకవర్గానికి నిధులు ఇవ్వరని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీసుకవచ్చిన ప్రొసిడింగ్ లను పూర్తి చేస్తే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మంచి పేరు వస్తుందన్నారు.

పైలెట్ పై పిచ్చికూతలు మానుకోండి
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై కొందరు వ్యక్తులు పిచ్చి కూతలు కూస్తున్నారని మండి పడ్డారు. రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, బీజేపీలో చేరుతారని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 2008 నుంచి బీఆర్ఎస్ పార్టీలో రోహిత్ రెడ్డి కొనసాగుతున్నారని అన్నారు. నిఖార్సైన తెలంగాణ ఉద్యమ కారుడు రోహిత్ రెడ్డి అని, ఆయన పార్టీ మారేది లేదని, పార్టీని వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాలను మానుకోవాలని సూచించారు.

27న కార్యకర్తల సమావేశం
మరోవైపు ఈనెల 27న తాండూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న కార్యకర్త సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు జిల్లా నేతలు, రాష్ట్ర నేతలు పాల్గొంటారని తెలిపారు. సమావేశం అనంతరం రోహిత్ రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బషీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, నరేందర్ గౌడ్, కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, యువనాయకులు, ఆనిల్ బాండ్, ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!