భూ సర్వేలపై ఫోకస్..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

భూ సర్వేలపై ఫోకస్..!
– జిల్లాలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శిక్షణ
– త్వరలో అందుబాటులోకి కొత్త వ్యవస్థ
– సర్వే సమస్యలకు పరిష్కారం, పైగా ఉపయోగాలు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో భూ సర్వే సమస్యలకు చక చక పరిష్కారం లభించే రోజులు దగ్గరపడుతున్నాయి. భూ సర్వేల కోసం కొత్తగా సర్వేయర్లు రాబోతున్నారు. భూ భారతి చట్టం 2025 అమలులో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సర్వేయర్ల కొరత తీర్చేందుకు లైసెన్స్​డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకరాబోతోంది. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లాలో 151 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లనె ఎంపిక చేసింది. గత నెల చివరి వారంలో ఎంపికైన సర్వేయర్లకు శిక్షణ ప్రారంభమయ్యింది.

జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో సర్వేయర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా భూ సర్వే పనులకు ఆటంకం ఏర్పడుతోంది. దీని వల్ల పనులు సజావుగా సాగడంలేదు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ల్యాండ్ మిస్సింగ్, పట్టదారు పేర్లు మారిపోవడం, విస్తీర్ణంలో తేడాలు రావడం వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. తమ భూముల సర్వే కోసం దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ సర్వేయర్ల కొరత కారణంగా నెలల తరబడి సమస్యలు పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి. ఈ క్రమంలోనే లైసెన్స్​డ్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే భూ సర్వే పనులు వేగవంతమయ్యే అవకాశాలున్నాయి.

శిక్షణ ఇలా..
భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా సర్వే ల్యాండ్ రికార్డు సహాయకులుగా లైసెన్స్​డ్ సర్వేయర్లను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. 50 రోజుల పాటు మూడు విడతల్లో వారికి శిక్షణ అందించనుంది. థియరీ, టిప్పన్ ప్లాటింగ్, ఫీల్డ్ లెవల్​లోఈ ట్రైనింగ్ ఇస్తున్నారు. మండల సర్వేయర్ కింద ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పాత రికార్డులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగేలా ఉర్దూ, మరాఠి, తెలుగులో.. అంకెలు, అక్షరాలపై అవగాహన కలిగేలా సర్వేయర్లకు శిక్షణ జరుగుతోంది. శిక్షణ సక్సెస్​ఫుల్​గా పూర్తిచేసుకున్నవారికి జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైతే ఫైనల్ అసెస్​మెంట్ టెస్టు నిర్వహించి, అందులో ప్రతిభ కనబర్చిన వారికి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్​ఫర్మేషన్ అండ్ మేనేజ్​మెంట్ విభాగం ద్వారా లైసెన్సులు జారీ చేస్తారు.

వ్యవస్థతో కలిగే ఉపయోగాలు
లైసెన్స్‌డ్ సర్వేయర్ల వ్యవస్థ విధానాన్ని అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో భూములకు సంబంధించి వివాధాలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములకు సంబంధించిన మ్యాప్‌లపై ఖచ్చితమైన వివరాలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ప్రస్తుతం రైతుల పేర్లు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం లాంటి వివరాలతో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ సమయంలో పలు కారణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వేయర్లు అందుబాటులోకి వస్తే వారి భూమికి సంబంధించిన మ్యాప్‌ భూ భారతి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల రిజిస్ట్రేషన్ సమయంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రతి పట్టాదారుడికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, భూమికి సంబంధించిన మ్యాప్‌ను సదరు రిజిస్ట్రేషన్‌ కాగితాల్లో నిక్షిప్తం చేయడంద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది.

ఇదికూడా చదవండి…

టీపీసీ కార్యవర్గంలో ధారాసింగ్‌కు చోటు..!