హోరా.. హోరీగా ఆర్యవైశ్య ఎన్నికలు..!
– కోట మురళీకృష్ణ ప్యానల్ ఘన విజయం
– కోడూరు వినోద్ కుమార్ ఓటమి, ప్యానల్లో ఇద్దరి గెలుపు
– ఎవరికి ఎంత మెజార్టీ వచ్చిందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు హోరా హోరీగా జరిగాయి. ఆదివారం ఉదయం పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం కౌంటింగ్ పూర్తయ్యింది. ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో కోట మురళికృష్ణ ప్యానల్ ఘన విజయం సాధించారు.

మరో ప్యానల్లో కోడూరు వినోద్ కుమార్ ఓటమి చెందగా.. ఆయన ప్యానల్లోని ఇద్దరు సభ్యులు గెలుపొందారు. 2026-28సంవత్సరానికి ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవుల కోసం కోట మురళీకృష్ణ, కోడూరు వినోద్ కుమార్ ప్యానల్లు పోటీ పడ్డాయి. అదేవిధంగా గౌడంపల్లి వసంత్ కుమార్ కూడా అధ్యక్ష స్థానానికి పోటీ చేశారు. కోట మురళీకృష్ణ ప్యానల్లో ప్రధాన కార్యదర్శిగా కోట్రిక కిరణ్ కుమార్, కోశాధికారిగా అడ్కిచెర్ల సంజీవ్ కుమార్, ఉపాధ్యక్షులుగా గుబ్బ యాదయ్య, సహాయ కార్యదర్శిగా పోల వేణుగోపాల్, కోశాధికారిగా అడికిచెర్ల సంజీవ్ కుమార్‌లు పోటీ చేశారు. కోడూరు వినోద్ కుమార్ ప్యానల్లో ఉపాధ్యక్షులుగా గుడుపల్లి అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రొంపల్లి సంతోష్ కుమార్, సహాయ కార్యదర్శిగా గుముడాల గౌరీ శంకర్, కోశాధికారిగా అయిత విజయ్‌కుమార్‌లు పోటీ చేశారు.

ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కోట మురళీకృష్ణకు 305ఓట్లు రాగా కోడూరు వినోద్ కుమార్(269ఓట్లు)పై 36 ఓట్ల మేజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కోట్రిక కిరణ్ కుమార్‌కు 325ఓట్లు రాగా రొంపల్లి సంతోష్ కుమార్(241ఓట్లు)పై 84 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా గుబ్బ యాదయ్యకు 293ఓట్లు రాగా గుడుపల్లి అనిల్‌కుమార్(273 ఓట్లు)పై 20 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కోశాధికారిగా అయిత విజయ్ కుమార్‌కు 286 ఓట్లు రాగా అడికి చెర్ల సంజీవ్‌కుమార్(281 ఓట్లు)పై 5 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కోట మురళీకృష్ణ ప్యానల్లో ఆయనతో పాటు గుబ్బ యాదయ్య, కోట్రిక కిరణ్ కుమార్‌లు గెలుపొందగా కోడూరు వినోద్ కుమార్ ప్యానల్లో సహాయ కార్యదర్శిగా గుముడాల గౌరీ శంకర్, కోశాధికారిగా అయిత విజయ్‌కుమార్‌లు విజయం సాధించారు. అధ్యక్ష పదవికి మూడో వ్యక్తిగా పోటీ చేసిన వసంత్ కుమార్‌కు ఓకే ఓటు వచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం 575 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 45 ఓట్లు చెల్లినవిగా గుర్తించారు.


