జై.. భజరంగీ..!
– వైభవంగా హనుమాన్ జయంతి
– నేత్ర పర్వంగా వీరహనుమాన్ శోభాయాత్ర
– యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– పూజలు నిర్వహించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : జై.. భజరంగీ.. జై.. హనుమాన్ అంటూ తాండూరు పట్టణం మార్మోగింది. గురువారం హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకున్నారు.

హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి ఉత్సవ సమితి, భజరంగ్ దళ్, హిందూ సంఘాలు, స్టేషన్ హనుమాన్ భజనమండలిల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన వీర హనుమాన్ శోభాయాత్ర అంగరంగవైభవంగా జరుగుతోంది. పట్టణంలోని స్టేషన్ హానుమాన్ మందిర్ నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమయ్యింది. స్టేషన్ హనుమాన్, మార్వాడిబజార్, భద్రేశ్వరౌ చౌక్, గాంధీచౌక్, వినాయకచౌక్, ఇందిరాచౌక్ తదితర ప్రధాన వీధుల గుండా ఈ యాత్ర ముందుకుసాగనుంది.

శోభాయాత్ర ప్రారంభంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సంలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శోభాయాత్రో జై భజరంగీ, జై హనుమాన్ నినాదాలు మార్మోగాయి. శోభాయాత్ర సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ బీఆర్ నాయక్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆద్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


