అరచేతిలోనే రిజిస్ట్రేషన్లు..!
– మెసేజ్ పెడితే చాలు పనైపోతుంది
– సర్టిఫికెట్లు, ఈసీ, స్టాంపుల సేవలు పొందే చాన్స్
– మీసేవా వాట్సాఫ్ సేవల్లో మార్పులు
– ఎలా పనికొస్తుందో తెలుసుకోండి
దర్శిని డెస్క్ : ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలు అందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త కొత్త చర్యలు చేపడుతోంది. అరచేతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే సేవలను విస్తృతం చేస్తోంది.

ఈ నిర్ణయం వల్ల పట్టణ వాసులతో పాటు పల్లె వాసులకు కూడా రిజిష్ట్రేషన్ల సేవలు దగ్గరవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ సేవ వాట్సప్ సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మీ సేవ వాట్సప్ సేవలను మరింత విస్తరించింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలు పొందవచ్చు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, ఈసీ, స్టాంపులు వంటివి వాట్సప్‌లోనే పొందవచ్చు.

అలాగే ఆన్‌లైన్‌లోనే ఫీజులు చెల్లించి ధ్రువీకరణ పత్రాలను వాట్సప్‌లోనే సులువుగా పొందవచ్చు. భూమి పత్రాలతో పాటు సర్టిఫైడ్ కాపీల కోసం రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ సేవలను మీ సేవ వాట్సప్ చాట్ బాట్‌లో ప్రవేశపెట్టారు. దీని వల్ల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను వాట్సప్ ద్వారా ప్రజలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సేవలు పట్టణ వాసులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతగానే ఉపయోగ పడనున్నాయి.

సేవలు ఎలా పనికోస్తాయంటే..?
మీ ఫోన్‌లో 8096958096 నెంబర్‌ను సేవ్ చేసుకోండి. వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ పెట్టండి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఎన్ కంబరెన్స్, సర్టిఫైడ్ కాపీ, స్టాంపులు, ఫ్రాంకింగ్, డెఫిసిట్ చెల్లింపులు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్, సొసైటీలు, అపరాధ రుసుంలు, సమాచార హక్కు చట్టం వంటి ఆప్షన్లు ఉంటాయి. మీకు కావాల్సిన సేవలను ఎంచుకుని తర్వాత అప్లికేషన్ వివరాలు నింపి పేమెంట్స్ చేయండి. అధికారుల ఆమోదం తర్వాత కాపీలు మీకు వాట్సప్‌కు వస్తాయి.


